కరోనా సంక్షోభంలో సైతం సెలవు తీసుకోకుండా రైతన్నలు పంటలు పండించారు. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలతో ప్రకృతి కన్నెర్ర చేస్తే నష్టపోయారే తప్ప వృత్తి మాత్రం మానలేదు. అలాంటి రైతులను కంటికి రెప్పలా కాపాడుతూ.. వారికి భరోసా ఇవ్వాల్సిన పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, పంటలు కొనే నాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతుంటే వారి జీవితాలను రాజకీయం చేస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ కార్పొరేట్ల ఆదాయం పెరిగింది. కానీ రైతాంగ ఆదాయం దారుణంగా పడిపోయింది. దినసరి కూలీ కన్నా తక్కువగా అంటే రైతు కుటుంబాల రోజువారీ సగటు సంపాదన 277 రూపాయలే అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పంట రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వాలకు ఒక ప్రణాళిక లేదు. మరి రైతన్నలు అప్పుల్లో కూరుకుపోక ఇంకేమవుతారు?
అప్పుల్లో తెలంగాణ 5వ స్థానం..
బ్యాంకుల నుంచి అప్పులు రాకపోవడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా దేశంలోని రైతు కుటుంబాల సగటు అప్పులు ఐదేండ్లలో 57% పెరిగాయి. తెలంగాణలో 91.7 శాతం, ఆంధ్రప్రదేశ్లో 93 శాతం రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. తెలంగాణలో ఒక రైతు కుటుంబం సగటు రుణం రూ.1,52,113గా ఉంది. ఏపీలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉన్నట్లు తేలింది. దేశంలో అత్యధిక రుణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో కేరళ రూ.2,42,482, పంజాబ్ రూ.2,03,249 ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. దేశంలో సగటున 59 శాతం రైతు కుటుంబాల రుణాలు పెరిగాయి. దేశంలోనే వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకునే వారు అత్యధికంగా తెలంగాణలో ఉన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలోని రైతు కుటుంబాలపై 105 శాతం అధిక అప్పు ఉంది. ఏపీలోని ఒక్కో కుటుంబంపై 221 శాతంగా అధిక అప్పు ఉంది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అత్యధిక రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్న టాప్ 10 రాష్ట్రాలను తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్(93.2%), తెలంగాణ (91.7%), కేరళ (69.9%), కర్నాటక (67.6%), తమిళనాడు (65.1%), ఒడిశా (61.2%), రాజస్థాన్ (60.3%), పంజాబ్ (54.4%), మహారాష్ట్ర (54%), పశ్చిమ బెంగాల్ (50.8%) ఉన్నాయి.
పాలకుల మాటలు నీటి మూటలే..
గత కొన్నేండ్లుగా అకాల లేదా అధిక వర్షాలు, తెగుళ్లతో పంట దిగుబడులు సరిగా రాలేదు. అదే టైంలో పండిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. పండిన పంటను కొనే నాథుడు లేక కళ్లాల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను మనం ఎన్నో చూశాం. చూస్తున్నాం. అప్పులు తీసుకున్న రైతులు తిరిగి చెల్లించడం లేదని, వారిని ఎగవేతదారుల జాబితాలో చేర్చి ఆస్తుల వేలానికి బ్యాంకు సిబ్బంది డప్పు దండోరా వేస్తున్నారు. అసలు దయన్నదే లేకుండా బ్యాంకు సిబ్బంది జప్తులకు పూనుకోవడంతో పరువు పోతుందని రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు. నేలనే నమ్ముకుని, వ్యవసాయంలో ఎన్ని కష్టాలొచ్చినా జాతికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతల గుండెల్లో అప్పుడప్పులు జప్తుల కోసం మోగిస్తుంటే? ఆత్మాభిమానం, ఎవరికీ కీడు తలపెట్టని నిజాయితీ గల రైతుల కుటుంబాల్లో చావుడప్పుగా మారుతోందని పాలకులు ఇప్పటికైనా గమనించాలి. దేశ ఖజానాను కొల్లగొట్టే వాళ్ళకు ఒక నీతి, జాతి ఆకలి తీర్చే రైతులకు మరో నీతా! అని రైతాంగం ఆవేదన చెందుతోంది. ఎన్నికల వేళ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ధాన్యభాండాగారం చేస్తాం అన్న మాటలు నీటిమూటలేనా! ఇలా పాలకుల ద్వంద్వ విధానాల మూలంగా రైతులు, పేదలు కడు పేదలుగా మారుతుంటే ? ధనికులు, కుబేరుల ఆస్తులు ఏటికేడు పెరిగిపోతున్నాయి. రైతాంగంపై అమానవీయంగా, నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా పాలకులు వ్యవహరిస్తే ఎలా? రైతు కుటుంబాలకు ఆత్మహత్యలే శరణ్యమా! ఇప్పటికైనా వారికి భరోసా కల్పించే విధానాలు అమలు చేయాలి.
అసమానతలు అంతం కావాలి..
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకోవటంలో అసువులు బాసిన అమరుల ఆకాంక్షలు 75 ఏళ్ల ప్రజా పాలనలో కూడా తీరకపోగా, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. 1 శాతం ఉన్న అత్యంత ధనికులకు పాలకులు సంపదను దోచిపెడుతూ పోవడంతో, 99 శాతం ఉన్న రైతులు, కూలీలు పేదలుగా మిగిలిపోతున్నారు. ఈ అసమానతలు అంతం కావాలి. పాలకులు అధికారం చేపట్టడానికి పార్టీలకు దొడ్డి దారిలో కుబేరులు, కార్పొరేట్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చందాల రూపంలో నిధులు ఇస్తున్నారు. మరోవైపు అధికారం చేజిక్కించుకోవాలంటే? ప్రజాస్వామ్యంలో ఎన్నికల వేళ మెజారిటీ వర్గాలైన రైతులు, కూలీలు, సామాన్యులు క్యూలైన్లో నిలబడి ఓట్లు వేస్తేనే పాలకులయ్యేది. ఓట్లు వేసిన వారికి, జాతికి అన్నం పెట్టే అన్నదాతలకు, శ్రమను నమ్ముకున్న సామాన్యులకు ఓ నీతి? దేశాన్ని, జాతి సంపదను దోచుకునే కార్పొరేట్లు, కుబేరులు, బ్యాంకులను కొల్లగొట్టే దోపిడీదారులకు మరో నీతా? రైతులను, కార్మికులను, పేదల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. దోపిడీదారులను మాత్రం దేశం దాటిస్తున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు భావ్యమా! శ్రమను నమ్ముకున్న కార్మిక, కర్షకుల జీవితాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పాలన సాగాలి. మన వ్యవసాయ ఆధారిత దేశానికి వెన్నెముకైన రైతులను, వ్యవసాయాన్ని ప్రగతి మార్గం పట్టించాలి. ఇలానే తిరోగమన విధానాలు సాగితే వ్యవసాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడేసి వారిని ప్రగతి మార్గంలో నడిపించి.. లాభాల బాట పట్టించాలి. ఇది ముమ్మాటికి పాలకుల బాధ్యత అని భావించండి. రేయింబవళ్లు శ్రమించి పసిడి పంటలు పండించే రైతులు, వారి కుటుంబాలు సుఖపడితేనే దేశం సుఖంగా ఉన్నట్లు లెక్క. రైతు కష్టం ఎంత విలువైనదో.. వారు పంట పండించకపోతేనే తెలుస్తుంది. అందుకనే కర్షకులకు భరోసా కల్పిస్తూ కాపాడుకోవడం మన కర్తవ్యం. పాలకుల ప్రధాన బాధ్యత అని విస్మరించరాదు.
ఎన్ని పథకాలు అమలులో ఉన్నా..
బ్యాంకింగ్ రంగంపై ప్రభుత్వాలు ఎంత ఒత్తిడి పెంచినా అవి సామాజిక బాధ్యతను మరిచి రైతులకు పంట రుణాలు అరకొరగానే అందిస్తున్నాయని పైలెక్కల ద్వారా తెలుస్తోంది. దాదాపు దేశం మొత్తం ఇదే జాడ్యంతో అల్లాడుతోంది. “రైతు బంధు, పీఎం కిసాన్” లాంటి పథకాలు అమలు చేస్తున్నా రాష్ట్రంతోపాటు దేశంలోని కోట్ల సంఖ్యలో ఉన్న సన్న, చిన్నకారు, కౌలు రైతులకు తోడ్పాటు ఎండమావేనని విశ్లేషణలు తెలుపుతున్నాయి. రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఓట్ల ఆకర్షణ పథకాలు ఎన్ని తెచ్చినా రైతాంగాన్ని సంక్షోభం నుంచి కాపాడలేవని గత అనుభవాలు తెలుపుతున్నాయి. మనదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకింగ్ రంగాన్ని దెబ్బతీసిన విజయ్ మాల్య, నీరవ్ మోడీలాంటి వారికి ఇబ్బడిముబ్బడిగా నిధులను, సమకూర్చి వాటిని ఎన్పీఏలుగా మార్చడంపై ఉన్న శ్రద్ధ, సేద్యాన్ని మోస్తున్న రైతాంగంపై వీసమెత్తు కూడా కనిపించడం లేదు.
-మేకిరి దామోదర్ ,సోషల్ ఎనలిస్ట్