పండుగ పూట కొట్లాట.. సర్పంచ్  మోసం చేశారని రైతుల ఆరోపణ

నకిరేకల్( శాలిగౌరారం), వెలుగు: శాలిగౌరారం మండలం ఊట్కూరులో దసరా పండుగ రోజు ఘర్షణ జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  గ్రామ సర్పంచ్  లోన్లు ఇప్పిస్తానని బ్యాంక్‌కు తీసుకెళ్లి మోసం చేశారని పలువురు రైతులు నెలరోజులుగా ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. సోమవారం దసరా పండుగ సందర్భంగా ఇదే విషయంలో సర్పంచ్‌తో రైతులు గొడవ పడ్డారు.

దీంతో సర్పంచ్, ఆయన కుటుంబ సభ్యులు బాధితులపై దాడి చేశారు.  ఈ క్రమంలో ఓ మహిళ పుస్తెలతాడు తెగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సె బందోబస్తుకు రాగా.. బాధితులు ఆయన వెహికల్‌ను అడ్డుకొని నిరసన తెలిపారు.  తమకు న్యాయం చేయకుండా సర్పంచ్‌కు కొమ్ముకాస్తున్నారని నిలదీశారు.  అనంతరం పోలీసులు లాఠీచార్జి చేసి బాధితులను చెదరగొట్టారు.