ఆయకట్టు ‘బంధం’ ఆగమాగం..

ఆయకట్టు ‘బంధం’ ఆగమాగం..

 నర్సింహులపేట, వెలుగు  : ఆయకట్టు అన్నదాతల బతుకులు ఆగమాగం అయ్యాయి. మహబూబాబాద్​జిల్లా నర్సింహులపేట బంధం చెరువు ఆయకట్టు కింద రైతులు సుమారు 150 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మూడు రోజుల కింద కురిసిన భారీ వర్షాల వల్ల చెరువుకు భారీ వరద వచ్చింది. ఇదే చెరువులో మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో చేపల కోసం ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఈ కంచెలు అడ్డుగా ఉండడం వల్ల వరదకు కొట్టుకు వచ్చిన చెత్తాచెదారం అక్కడే చేరి మత్తడి నుంచి పోవాల్సిన వరద కట్టపై నుంచి పోయి కోతకు గురైంది.

దీంతో రెండు చోట్ల చెరువు కట్ట తెగింది. 70 ఎకరాల్లో పంట నీట మునగగా, 40 ఎకరాల్లో ఇసుకమేటలు వేశాయి. ఆయకట్టు కింద ఉన్న బావులు, బోర్ల స్టాటర్లు, పైపులు, వైర్లు కొట్టుకుపోయాయి. కరెంట్ పోల్స్ వరదల్లో విరిగిపోవడంతో పాటు కొన్ని కొట్టుకుపోయాయి. అందరూ చిన్నకారు రైతులే కావడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, సొసైటీ వారు వలలు, కంచెలు ఏర్పాటు చేయనీయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.     -