నిర్మల్: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను విరమించాలని రైతులు నిర్ణయించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్తో రైతుల చర్చలు సఫలం కావడంతో స్థానికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ ముందు కొన్ని అభ్యర్థనలు ఉంచారు. దయచేసి ఫ్యాక్టరీని ఒక మూడు నెలల వరకు తాత్కాలికంగా బంద్ చేయాలని కలెక్టర్ను కోరారు.
గవర్నమెంట్ నుంచి ఫ్యాక్టరీ వద్దనే నిర్ణయం వచ్చేంతవరకూ ఫ్యాక్టరీని తెరవొద్దని చెప్పారు. ఒకవేళ ఈ ఆందోళనపై ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేయాలని భావిస్తే ప్రతి గ్రామం నుంచి ఐదుగురు సభ్యులను తీసుకెళ్లి సమావేశం నిర్వహించాలని, ఆ తర్వాత గ్రామ అభివృద్ధి కమిటీతో మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్కు స్పష్టం చేశారు.
ALSO READ | దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్
ఇప్పుడైతే తక్షణమే ఈరోజు(బుధవారం) అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, మంగళ, బుధ వారాల్లో జరిగిన ఆందోళనల్లో రైతుల మీద ఎలాంటి కేసులు పెట్టకూడదని కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులను రైతులు అభ్యర్థించారు. ఇందుకు కలెక్టర్, ఎస్పీ సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించాలని రైతులు నిర్ణయించారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఐదు గ్రామాల ప్రజలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. వెంటనే ఫ్యాక్టరీ పనులను నిలిపివేసి తరలించాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్– గుండంపల్లి గ్రామాల మధ్య పరిశ్రమను నిర్మిస్తుండగా ఐదు గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు దిలావర్పూర్ వద్ద నిర్మల్ – భైంసా ప్రధాన రహదారిపై బైఠాయించారు. దిలావర్పూర్, గుండంపెల్లితో పాటు సముందర్ పల్లి , టెంబుర్ని, సిర్గాపూర్ కాండ్లీ గ్రామాల రైతులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఆర్డీవో రత్న కల్యాణిని దాదాపు 8 గంటల పాటు నిర్బంధించడంతో ఈ ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దిలావర్పూర్లో హై టెన్షన్ బుధవారం కూడా కొనసాగింది. పోలీసులపై స్థానికులు రాళ్ల దాడికి దిగారు. పురుగు మందు డబ్బాలతో నిరసన తెలిపారు. డీఎస్పీ కారు అద్దాలను ధ్వంసం చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నేరుగా రంగంలోకి దిగి రైతులను చర్చలకు ఆహ్వానించారు. ఆ చర్చలు సఫలం అయ్యేలా చొరవ చూపడంతో దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను విరమించాలని రైతులు డిసైడ్ అయ్యారు.