నివేదికలకే పరిమితమైన ఆఫీసర్లు 

  • పరిహారం అందుతలే!
  • నివేదికలకే పరిమితమైన ఆఫీసర్లు 
  • ఆందోళనలో రైతులు

నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు, వరదలతో పంటలు కోల్పోయిన రైతులకు ఆరేళ్లుగా నష్ట పరిహారం అందడం లేదు. 2016 నుంచి 2021 వరకు రైతులు పంటల బీమా వాటా చెల్లించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా చెల్లించలేదు. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నష్టంపై వ్యవసాయ శాఖ నివేదికలు పంపినా ఫలితం లేకుండా పోతోంది. గురువారం కురిసిన వర్షాలకు కూడా ఎలాంటి పంట నష్టం జరుగలేదని అగ్రికల్చర్ శాఖ పేర్కొనడం గమనార్హం.

ఆరుసార్లు నీట మునిగి..

ఈ ఖరీఫ్‌‌‌‌లో అల్పపీడన ద్రోణి వల్ల కురిసిన వానలతో భారీ నష్టం జరిగింది. వరదలతో జిల్లా వ్యాప్తంగా 65 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. అగ్రికల్చర్ ఆఫీసర్లు10 వేల ఎకరాలే జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. నాట్ల దశలోనే భారీ వర్షాలతో పొలాల్లోకి నీరు చేరడంతో విత్తనాలు మురిగిపోయాయి.  12 వేల ఎకరాల పంటలు దెబ్బతినగా ఎకరానికి రూ.25 వేల చొప్పన రూ.30 కోట్ల నష్టం జరిగింది. తర్వాత మరోసారి కురిసిన వానలకు 30 వేల ఎకరాల పంటలు కోల్పోగా.. ఎకరానికి సుమారు రూ.8 వేల చొప్పున రూ. 24 కోట్లు నష్టం జరిగింది. ఇంకా ప్రస్తుత పంట దిగుబడులపై వానల ప్రభావం చూపనుంది. మొత్తంగా ఈ ఖరీఫ్‌‌‌‌లో ఆరుసార్లు వరదలతో రూ.54 కోట్ల నష్టం జరిగింది.

ఆరేళ్లుగా నష్టాలే..

ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌లో జిల్లాలో ఆరేళ్లకు రైతులకు నష్టాలు తప్పడం లేదు. ప్రతీ సారి పంట చేతికొచ్చే సమయంలోనే అధిక వర్షాలతో నష్టం వాల్లింది. 2016లో ఖరీఫ్‌‌‌‌లో 35 వేల ఎకరాలు, 2017లో 30 వేలు, 2018లో 40 వేలు, 2019లో 38 వేలు, 2020లో 30 వేలు, 2021లో 26 వేల ఎకరాల్లో పంటలు వరద తాకిడికి  దెబ్బతింటున్నాయి. .

నష్ట పరిహారం ఇవ్వాలి

నేను ఆరు ఎకరాల్లో వరి వేశాను. వరదలతో దాదాపు 5 ఎకరాల పంట దెబ్బతిన్నది. చేసిన కష్టం అంతా వృథా అయ్యింది. సర్కార్ సర్వే చేసి నష్ట పరిహారం ఇప్పించాలి. : గంగారెడ్డి, రైతు 

పైసా ఇయ్యలేదు..

గతేడాది నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇయ్యలేదు.  పంటలు నీట మునిగినప్పుడు మినిస్టర్ వస్తుండు. ఆఫీసర్లు నివేదిక ఇచ్చినం అంటున్నరు. కానీ రైతులకు పైసా రావడం లేదు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రైతు బంధు ఇచ్చి పరిహారం ఎగ్గొడుతుండు. : అల్జాపూర్ 

శ్రీనివాస్,  బీజేపీ నేత