
- లైన్మెన్లు, సిబ్బంది ఇబ్బంది పెడుతున్నరు
- ఈఆర్సీ బహిరంగ విచారణలో రైతుల ఆవేదన
- పశువుల షెడ్లకు ఫ్రీ కరెంట్ఇవ్వాలని చైర్మన్‌కు వినతి
హనుమకొండ, వెలుగు: కరెంట్పోల్స్వేయాలన్నా.. లూజ్‌వైర్లు గుంజాలన్నా లైన్ మెన్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి పైసలు ఇవ్వాల్సిందే.. లేకుంటే పని చేస్తలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్లు రిపేర్‌కు వచ్చినా.. వాటి తరలింపు, మరమ్మతుల భారాన్ని కూడా తమపైనే వేస్తున్నారని వాపోయారు. టీజీఎన్పీడీసీఎల్ 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ ఛార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) ఛైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో బహిరంగ విచారణ నిర్వహించారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి వచ్చిన 41 మంది వినియోగదారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యుత్‌శాఖ అధికారులు ఫ్యూజులు వేయడానికి కూడా సరైన సమయంలో రాకపోవడం వల్ల రైతులు సొంతంగా రిపేర్చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.
ట్రాన్స్ ఫార్మర్లు రోడ్డుకు షిఫ్ట్ చేయాలి
ట్రాన్స్ ఫార్మర్లు రిపేర్‌కు వస్తే అధికారులు వాటిని ఉచితంగా తరలించి, రిపేర్ చేయించాల్సిందిపోయి... తమపైనే భారం వేస్తున్నారని పలువురు రైతులు ఈఆర్సీ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ట్రాన్స్ఫార్మర్లు పొలాల మధ్య ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని రోడ్డు పక్కకు షిఫ్ట్చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పొలాల మధ్య ఉన్న విద్యుత్లైన్లు వేలాడుతుండటం వల్ల ప్రమాదాలు జరగుతున్నాయని, వాటిని తొలగించాలన్నారు.
జగిత్యాల జిల్లాలో ఈ సమస్యగా ఎక్కువగా ఉందని తెలిపారు. హసన్‌పర్తి మండలం జయగిరి శివారులోని సర్వే నంబర్ 59, 60లోని సాగు భూముల్లో విద్యుత్‌వైర్లు వేలాడుతున్నాయని, వాటివల్ల రైతులు చనిపోయే ప్రమాదం ఉందని రడపాక పరంజ్యోతి అనే రైతు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ స్లమ్ ఏరియాల్లో విద్యుత్బకాయిలు పెద్ద మొత్తంలో ఉండటం వల్ల వారు బిల్లులు కట్టలేకపోతున్నారని, అలాంటి వారికి వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రాయితీ ఇవ్వాలని విన్నవించారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తాం : సీఎండీ వరుణ్ రెడ్డి
ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించి, విద్యుత్‌సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. వినియోగదారులు చెప్పిన సమస్యలకు ఆయన వివరణ ఇచ్చారు. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు పక్కకు షిఫ్ట్ చేసేందుకు అంచనాలు రూపొందిస్తామన్నారు. అన్ని ట్రాన్స్ఫార్మర్లపై 1912 టోల్ ఫ్రీ నంబర్ రాయించి, వినియోగదారులకు అందుబాటులో ఉంటామని చెప్పారు.
ప్రతీ గ్రామ పంచాయతీ ఆఫీస్ సిటిజన్ ఛార్టర్ పెడతామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జేఎల్ఎం, సబ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. పరిహారం కూడా వెంటనే మంజూరయ్యేలా చూస్తామన్నారు. లూజ్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచుతామని తెలిపారు. దశల వారీగా పనులు జరుగుతున్నాయని ఆరేడు నెలల్లో అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.
మీటర్లు ఇవ్వకుండా పెనాల్టీనా?
సాగుకు ఉచిత కరెంట్ఇస్తున్నరు. కానీ, వ్యవసాయంలో భాగమైన పశు సంపద కోసం వేసుకునే షెడ్లకు మీటర్ కనెక్షన్ఇవ్వడం లేదు. మీటర్లు ఇవ్వకుండా పెనాల్టీ కట్టమంటే రైతులు ఎలా కడ్తరు? పశువుల షెడ్లకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సంజీవ్‌రెడ్డి, రైతు
పరిహారం ఇస్తలేరు
విద్యుత్ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం ఇస్తలేరు. కరీంనగర్ జిల్లా ఈదులగట్టెపల్లిలో షార్ట్సర్క్యూట్జరిగి, ఇల్లు కాలడంతో ఏడేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గత అక్టోబర్‌లోనే ఈ ఘటన జరిగినా ఇంతవరకు బాధిత కుటుంబానికి పరిహారం అందలేదు. ఇప్పటికైనా ఆదుకోవాలి.జె.సంపత్‌రావు, రైతు