- గోదావరి పరివాహక రైతులకు ఊరట
- రైతులతో అగ్రిమెంట్చేసుకుంటున్న గాడ్ఫ్రె ఫిలిప్స్ ఇండియా కంపెనీ
భద్రాచలం, వెలుగు : నల్లరేగడి నేలల్లో మిర్చి సాగు చేసి వరుసగా మూడేళ్లు నష్టాలను చవిచూసిన రైతులకు ఊరట లభించింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి నేలల్లో లంకపొగాకు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరను ఇచ్చి తీసుకునేందుకు ఏపీలోని గుంటూరు కేంద్రంగా పనిచేసే గాడ్ఫ్రె ఫిలిప్స్ ఇండియా కంపెనీ అగ్రిమెంట్ చేసుకుంటోంది. దీంతో మిర్చికి బదులుగా లంకపొగాకు పంట సాగు చేస్తున్నారు.
4 వేల ఎకరాల అగ్రిమెంట్కు టార్గెట్..
గాడ్ ఫ్రె ఫిలిప్స్ ఇండియా కంపెనీ 4వేల ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకునేందుకు టార్గెట్గా పెట్టుకోగా ఈ ఏడాది 2వేల ఎకరాలను చేరుకోగలిగింది. భద్రాచలం మన్యంలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లో నల్లరేగడి నేలల్లో పండించే మిరపకాయలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
కానీ గత మూడేళ్లుగా తామర పురుగు, ఎండు తెగులు వల్ల పంటలు మొత్తం మాడిపోయాయి. దిగుబడి పడిపోయి రైతులంతా నష్టపోయారు. రైతులు ఇన్నాళ్లు ప్రత్యామ్నాయం లేక వ్యవసాయం మానుకున్నారు. కొందరు కంది, మినప, పెసర పంటలు సాగు చేశారు. కానీ ఇదే సమయంలో లంక పొగాకు అగ్రిమెంట్ రైతులకు ప్రత్యామ్నాయంగా కనిపించింది. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఇదో మార్గంగా భావించి పొగాకు పంట సాగుకు దిగారు.
వద్దనుకున్నదే ఆసరా అయ్యింది..!
గతంలో గోదావరి పరివాహక ప్రాంత రైతులు లంక పొగాకు సాగు అంటే దూరంగా ఉండే వారు. మార్కెట్ ఉండదు. సరైన ధర రాదు. అందుకే ఈ పంట సాగుకు విముఖత చూపేవారు. వర్జీనియా పొగాకు ఎక్కువగా పండించి లాభాలు గడించారు. కానీ వర్జీనియా పొగాకు సాగుపై నిషేధం విధించడంతో రైతులకు మిరప పంటే శరణ్యం అయ్యింది. కాలక్రమంలో వాతావరణ మార్పులు, నేల స్వభావంలో తేడా తదితర కారణాలతో మిర్చి నష్టాలనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో వద్దనుకున్న లంక పొగాకే రైతులకు ఆసరాగా
మారింది.
ఎకరాకు రూ.1.30లక్షలు పెట్టుబడి
లంక పొగాకుకు కూడా మిర్చి తరహాలోనే ఎకరా సాగుకు రూ.1.30లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. ఎకరాకు 14 నుంచి 15 క్వింటాళ్ల లంక పొగాకు వస్తుంది. క్వింటా లంక పొగాకును రూ.18వేల గిట్టుబాటు ధరను ఇచ్చి కొనుగోలు చేస్తామని గాడ్ ఫ్రె ఫిలిప్స్ ఇండియా కంపెనీ రైతులతో ఒప్పందం చేసుకుంటోంది. విత్తనాలు, పిలక రాకుండా తెల్లమందు, టార్బాల్ ఇలా అవసరమైన వాటికి కంపెనీయే 50శాతం సబ్సిడీ ఇస్తుంది.
అనుకున్న ప్రకారం దిగుబడి వస్తే రూ.2.70లక్షల వరకు ఆదాయం వస్తుంది. దీనితో రైతులు లంకపొగాకు సాగుకు ఈ కంపెనీతో అగ్రిమెంట్ కోసం ముందుకొస్తున్నారు. ఈ పొగాకు అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. క్వింటా ధర ఇంకా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశపడుతున్నారు.
లంకపొగాకు సాగు చేస్తున్న..
గతంలో 25 ఎకరాలు వరకు మిర్చి సాగు చేశా. నష్టాలొచ్చి అప్పులు మిగిలాయి. లంకపొగాకు సాగు చేస్తే గిట్టుబాటు ధరను ఇచ్చేందుకు గాడ్ ఫ్రె ఫిలిప్స్ ఇండియా కంపెనీ వచ్చింది. క్వింటాకు రూ.18వేలు ఇస్తామన్నారు. అందుకే సాగు చేస్తున్నాను. కానూరి బుల్లయ్య, రైతు