కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యత మార్కెటింగ్ శాఖదే
మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తం
రాష్ట్రవ్యాప్తంగా ఏ గుంటలో ఏం పంట వేశారో పదిరోజుల్లో లెక్కలు తీయాలె: సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: రైతుల పంటలను అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్లే వేదిక అని, రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి పంటలు అమ్ముకునే విధానం తేవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి సరైన పద్ధతి అవలంబించే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రతి గుంటలో ఏయే పంటలు వేశారన్నదానిపై పది రోజుల్లో లెక్కలు తీయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ కాగితం, కలం శాఖగా కాకుండా పొలం, హలం శాఖగా మారాలన్నారు. పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులపై కృషి చేయాలన్నారు. ఆదివారం ప్రగతిభవన్ లో జిల్లా స్థాయి వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు.
రైతు వేదికలు రెడీ చేయండి
కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెంటనే వాడుకలోకి తెచ్చి, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఏఈవోలు, రైతుబంధు సమితి కార్యాలయాలూ రైతు వేదికలోనే భాగంగా ఉండాలని.. ఇందుకు ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. మిషన్భగీరథతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లందించి నంబర్ వన్ గా నిలిచామని, దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు. రెవెన్యూలో అత్యంత జటిలమైన సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు.
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఏటా 35 లక్షల టన్నుల ధాన్యం పండించేవారని.. ఇప్పుడు కోటీ పది లక్షల టన్నులు పండిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర సర్కారు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మిస్తున్న ప్రాజెక్టులతో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతామని.. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు నీరు వస్తుందని అన్నారు. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. “రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. దానివల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. రైతు వేదికలను వెంటనే వినియోగంలోకి తెచ్చి.. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాల పై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్నపంటల విషయంలో స్పష్టత రావాలి” అని కేసీఆర్ ఆదేశించారు.
అధికారులకు సీఎం ఆదేశాలివీ..
అన్ని రైతు వేదికలను వెంటనే ఉపయోగంలోకి తేవాలి. ఏఈవో, రైతుబంధు సమితి కార్యాలయాలను రైతువేదికల్లోనే ఏర్పాటు చేయాలి. రైతు వేదికలకు భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. మైక్ సెట్ సమకూర్చాలి. ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి. ఏ క్లస్టర్ లోనైనా ఏఈవో పోస్టు ఖాళీ అయినా, ఎవరైనా లాంగ్లీవులో వెళ్లినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి. సాగులో కొత్త పద్ధతులపై స్టడీకి వ్యవసాయాధికారులు ఇజ్రాయెల్లో పర్యటించాలి.
- రైతులు పంటలు అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలి. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్ కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలి. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేయాలి.
- రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నదీ, అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నదన్న వివరాలు సేకరించాలి.
- పప్పులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. వీటిని పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది.
- ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి.
- వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 159 బార్లు.. ఇయ్యాల నోటిఫికేషన్..