పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు.. కామారెడ్డిలో భారీ ర్యాలీ

పంట నష్ట పరిహారం చెల్లించాలంటూ కామారెడ్డిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నిజాంసాగర్ ​చౌరస్తా మీదుగా కలెక్టరేట్​ వరకు కొనసాగింది. రైతులు కలెక్టరేట్​లోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టడంతో గేటు ముందే కూర్చొని నిరసన తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని, తడిసిన వడ్లను ఎలాంటి షరతులు లేకుండా కొనాలని, పంటనష్టంపై సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.


కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: పంట నష్ట పరిహారం కోసం రైతులు రోడ్డెక్కారు. గురువారం బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. సిరిసిల్ల రోడ్డు, ఇందిరా చౌక్, స్టేషన్​రోడ్డు,  రైల్వే కమాన్​మీదుగా నిజాం సాగర్​చౌరస్తా వరకు సాగింది. ఇక్కడ రైతులు ఆందోళన చేశారు. అనంతరం కలెక్టరేట్​కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కలెక్టరేట్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో రైతులు మెయిన్ గేట్ ముందే కూర్చొని ధర్నా చేశారు. పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని, తడిసిన వడ్లను ఎలాంటి షరతులు లేకుండా కొనాలని, పంటనష్టంపై సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. తప్ప, తాలు, తరుగు పేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకోవాలన్నారు. కలెక్టర్​బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని నినాదాలు చేశారు. 10 మంది రైతులు లోపలికి వెళ్లి వినతిపత్రం ఇవ్వవచ్చని పోలీసులు చెప్పడంతో.. కొంతమంది వెళ్లి కలెక్టర్ జితేశ్ వి పాటిల్​ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు లేకుండా చూస్తామని, పంట నష్టంపై ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తామని కలెక్టర్ చెప్పారు. 

వారంలోగా చెల్లించాలె.. 

వారం రోజుల్లోగా రైతుల అకౌంట్లలో పరిహారం జమ చేయాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు. నిజాంసాగర్ చౌరస్తాలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యే స్పందించి 48 గంటల్లోగా పంట నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం అనేది  ప్రకటించాలి. పరిహారం రైతుల అకౌంట్లలో జమ అయితే, దాన్ని లోన్ల కింద బ్యాంకులు కట్ చేసుకోకుండా చూడాలి. కామారెడ్డి నియోజకవర్గాన్ని డ్రాట్ ఏరియాగా ప్రకటించాలి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై సమగ్ర వివరాలు సేకరించాలి” అని డిమాండ్ చేశారు.

ఆరెకరాల్లో పంట దెబ్బతిన్నది 

ఆరెకరాల్లో వరి వేసిన. వడగండ్ల వానకు పంటంతా దెబ్బతిన్నది. గవర్నమెంట్ ఆదు కోవాలి. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలి.
- క్రిష్ణారెడ్డి, జంగంపల్లి, కామారెడ్డి జిల్లా 

అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన

అప్పు చేసి వరి వేసిన. పంట కోతకొచ్చే టైమ్ లో వానలు పడి మొత్తం పోయింది. అప్పులు ఎలా తీర్చాలో అర్థమైతలేదు. సర్కారే మమ్మల్ని ఆదుకోవాలి.  
- పరశురాములు, సోమార్​పేట, కామారెడ్డి జిల్లా