సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

గద్వాల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో రాస్తారోకోలు

పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మూడు జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో, గద్వాల - రాయచూర్ రహదారిపై, జగిత్యాల జిల్లాలో పూడూర్ వద్ద ధర్నా ధర్నాలు చేశారు. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గద్వాల, దండేపల్లి, కొడిమ్యాల, వెలుగు : పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మూడు జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో, గద్వాల– రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారిపై, జగిత్యాల జిల్లాలో పూడూర్ వద్ద ధర్నా ధర్నాలు చేశారు. మంచిర్యాల జిల్లా గూడెం ఎత్తిపోతల ఆయకట్టు కింద దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని రైతులు వరి పంట వేశారు. నాట్లు వేసిన నాటి నుంచి సాగునీరు అందించకుండా మరమ్మతుల పేరుతో మోటార్లు ఆఫ్ చేస్తున్నారని, దీంతో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని పట్టుబట్టారు. చివరికి అడిషనల్​కలెక్టర్ స్పందించి వెంటనే రిపేర్ చేయించి సాగునీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.

గద్వాల జిల్లా నెట్టెంపాడు లిఫ్టు ఆయకట్టు కింద ఏడు రోజులకోసారి నీళ్లు వదులుతున్నారని, కనీసం వారంలో రెండుసార్లైనా ఇస్తే పంటలు ఎండకుండా చూసుకుంటామని రైతులు పేర్కొన్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి 25 వేల ఎకరాలకు నీళ్లు అందించాల్సి ఉన్నా.. సగం ఆయకట్టుకు కూడా అందడం లేదని, కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల – రాయచూర్ రహదారిపై మైలగడ్డ స్టేజీ సమీపంలో ధర్నా చేశారు. నాలుగు రోజులకు ఒకసారైనా నీళ్లు వదిలితే తప్ప పంటలు చేతికి రావన్నారు. ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ఎండుతున్న పంట పొలాలను కాపాడాలని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. జగిత్యాల, కరీంనగర్ హైవే పూడూర్ వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.

పంట ఎండిపోయింది

కాలువలకు నీరు రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. శనివారం నీళ్లు ఇస్తే మళ్లీ శనివారం దాకా వదలడం లేదు. దీంతో పంటలను కాపాడుకోలేకపోయా. తీవ్రంగా నష్టపోయా.

‑ హనుమంతు, ఉమిత్యాల, గద్వాల జిల్లా