గద్వాల, వెలుగు : ఒక్కసారిగా టమాటా రేటు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటాలు తెంపే కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పొలాల దగ్గరే టమాటాలను పారబోస్తున్నారు. మరికొందరు టమాటాలు తెంపకుండా వదిలేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తే 20 కేజీల బాక్స్‌కు రూ.200 ఇస్తున్నారు. ప్రతి బాక్స్ కు రూ.60 ట్రాన్స్ పోర్ట్ ఖర్చు, ఏజెంట్ కమీషన్ రూ. 10 పోను ఏమీ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు.
టమాటా తెంపే కూలీలు, వ్యవసాయ ఖర్చులు లెక్కేస్తే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. గద్వాల్ మార్కెట్లో అమ్మితే మరింత నష్టం వస్తుందని చెబుతున్నారు. లోకల్ మార్కెట్ లో రూ.150కి బాక్స్ కొంటున్నారని, కమీషన్, హమాలీ కింద బాక్స్‌కు రూ.20 తీసుకుంటున్నారని, ఆటో వాళ్లు బాక్స్‌కు రూ.30 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలా ఖర్చులు పోను ఏమీ మిగలడం లేదని వాపోతున్నారు.