మహబూబ్​నగర్ జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు.. కాలిపోతున్న మోటార్లు

మహబూబ్​నగర్ జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు.. కాలిపోతున్న మోటార్లు
  • పడిపోయిన భూగర్భ జలాలు
  • వ్యవసాయానికి పెరిగిన కరెంట్​ వినియోగం
  • బోర్లను నిరంతరంగా నడిపిస్తున్న రైతులు
  • ట్రాన్స్ ఫార్మర్లపై అధిక లోడ్​ పడి, లో వోల్టేజీ సమస్య
  • మోటార్ల రిపేర్​ ఖర్చులతో     రైతుల ఇబ్బందులు
  • మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో పరిస్థితి

మహబూబ్​నగర్​/చిన్నచింతకుంట, వెలుగు: వ్యవసాయానికి కరెంట్​వినియోగం పెరుగుతోంది. సాగునీటి వసతులు లేకపోవడంతో బోర్ల ఆధారంగా పంటలు వేసుకున్న రైతులు.. నీరందించడానికి బోర్లను నిరంతరాయంగా నడుపుతున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ల మీద అధిక లోడ్​ పడి, లో వోల్టేజీ సమస్య తలెత్తుతుండటంతో మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. వాటిని రిపేర్ చేయించుకోలేక, పంటలను కాపాడుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు..

ఈ యాసంగిలో మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో రైతులు దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం 90 శాతం ఏరియాల్లో పంటలు పాల గింజ నుంచి గింజ పెట్టే దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులో చేతికి రానున్నాయి. అప్పటివరకు నీటి తడులు అందించాలి. అయితే, ఈ ఏడాది అధిక వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఫుల్ కెపాసిటీకి చేరుకున్నా.. ఎండల కారణంగా నీటి నిల్వలు వేగంగా పడిపోయాయి. దీంతో, ప్రాజెక్టులు, కెనాల్స్​కింద సాగునీటికి వారబందీ ప్రకటించారు. జనవరి వరకు 5 మీటర్లలోపు ఉన్న గ్రౌండ్​వాటర్​.. ఎండలు ముదరడంతో ఫిబ్రవరి నెలాఖరుకు5 మీటర్లకు పడిపోయాయి. 

మోటార్లకు ఆటోమేటిక్​ స్టార్టర్లు..

పంటలకు నీరందించేందుకు రైతులు మోటార్లను రన్నింగ్​లోనే ఉంచుతున్నారు. కొందరు వాటికి ఆటోమెటిక్ స్టార్టర్లను బిగించారు. మిగతా రైతులు నీరు పారించేందుకు కరెంటు వచ్చే సమయానికి చేల వద్దకు చేరుకొని, మోటార్లను ఆన్​చేస్తున్నారు. దీనివల్ల 100 కేవీ, 66 కేవీ ట్రాన్స్​ఫార్మర్లపై అధిక లోడ్​పడుతోంది. లో వోల్టేజీ సమస్య తలెత్తి మోటార్లు కాలిపోతున్నాయి. విద్యుత్​శాఖ అధికారులు ఒక ఫీడర్​ను ఆఫ్​ చేసి, మరో ఫీడర్​లో కరెంట్​సరఫరా చేస్తున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదు. గృహాలతోపాటు వ్యవసాయానికి విద్యుత్​వినియోగం పెరగడంతో  కరెంట్​ సరఫరాలో ఫ్లెచింగ్స్​వచ్చి, మోటార్లు మొరాయిస్తున్నాయి.

రిపేర్లకు రూ.వేలల్లో ఖర్చు..

సాధారణంగా రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పంట పెట్టుబడి పెడతారు. ఫిబ్రవరిలో పంటలు దెబ్బతినడంతో వాటిని కాపాడుకునేందుకు పలు రకాల మందులు వాడటంతో రూ.5 వేలు అదనంగా ఖర్చు చేశారు. ఇప్పుడు బోర్​మోటార్ల రిపేర్ల​కోసం రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు భారం పడుతోంది. 

వైండింగ్​ కరుగుతోంది

మా షాప్​కు రోజుకు 10 నుంచి 12 మోటార్లు రిపేర్​కోసం వస్తున్నాయి. ఎక్కువగా వైండింగ్​కాలిపోతోంది. దీనికి కారణం చాలాసేపు మోటార్లను రన్​చేయడమే. రిపేర్​కు రూ.2,500 వరకు ఖర్చవుతుంది.- రాంరెడ్డి, మోటార్​మెకానిక్, ఓల్డ్​బస్టాండ్, మహబూబ్ నగర్​

రోజుకు 10 మంది ఫోన్​

మాకు 2 మోటార్ లిఫ్టింగ్ వెహికిల్స్​ఉన్నాయి. మోటార్లు కాలిపోతున్నాయని రోజుకు 10 మంది రైతులు ఫోన్​చేస్తున్నారు. వాటిని బయటకు తీసి, మెకానిక్​వద్దకు పంపుతున్నం. తర్వాత బావిలో దింపుతాం. ఇందుకోసం రూ.2,500 తీసుకుంటున్నం.కుర్వ చందు, అప్పంపల్లి,కౌకుంట్ల మండలం