
- చాలా చోట్ల ప్రారంభం కాని కొనుగోళ్లు
- రోజుల తరబడి రైతుల పడిగాపులు
- అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు
- టార్పాలిన్లు లేక తిప్పలు
మెదక్/శివ్వంపేట, వెలుగు: జిల్లాలో వరి కోతలు జోరందుకున్నాయి. కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వస్తోంది. కానీ ఇప్పటికీ ఎక్కడా వడ్ల కొనుగోళ్లు షురూ కాలేదు. ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా కొబ్బరి కాయలు కొట్టి కేంద్రాలు ఓపెన్ చేస్తున్రు కానీ అక్కడ వడ్లు కాంటా పెట్టించడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 68 కేంద్రాలను ప్రారంభించగా.. 15 చోట్ల మాత్రమే కాంటాలు మొదలయ్యాయి. దీంతో అనేక కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. అకాల వర్షాలు పడుతుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు తడిసి పోతున్నాయి. టార్పాలిన్లు లేక రైతులు తిప్పలు పడుతున్నారు.
మెదక్ జిల్లాలో..
ఈ యాసంగి సీజన్లో 1,67,794 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగైంది. 4.19 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 3.77 లక్షల టన్నుల ధాన్యం కొనాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్, డీసీఎంఎస్, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో మొత్తం 341 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం యాసంగి వడ్లు కొనాలని నిర్ణయించిన వెంటనే ఈ నెల14న హవేలి ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేతోపాటు, అడిషనల్ కలెక్టర్రమేశ్ప్రకటించారు. మళ్లీ 25న పాపన్నపేట మండలంలోని కుర్తివాడ, ఆరెపల్లి, యూసుఫ్‌పేట, కొత్తపల్లి, పాపన్నపేటలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ ఇంత వరకు జిల్లాలో ఎక్కడా కాంటా పెట్టలేదు.
పది రోజులుగా జిల్లా అంతటా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. హార్వెస్టర్లతో కోస్తుండటంతో వడ్లను వెంటనే ట్రాక్టర్లలో నింపి డైరెక్ట్‌గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ వడ్లు ఆరబోసి శుభ్రం చేస్తున్నారు. ఇలా హవేలి ఘనపూర్, పాపన్నపేట, కొల్చారం, కౌడిపల్లి, వెల్దుర్తి, శివ్వంపేట, రామాయంపేట మండలాల పరిధిలో అనేక కేంద్రాల వద్దకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చింది. అయితే అక్కడ వడ్ల కాంటా పెడ్తలేరు. గన్నీ బ్యాగుల కొరతకు తోడు, కొనుగోలు కేంద్రాలకు రైస్‌మిల్లుల అలాట్మెంట్ ప్రాసెస్ పూర్తి కాకపోవడం ఇందుకు కారణం. రైతులు రాత్రింబవళ్లు వడ్ల కుప్పల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరో వైపు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం వెల్దుర్తి, శివ్వంపేట మండలాల పరిధిలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. వెల్దుర్తి, శివ్వంపేట మండలం ఏదులాపూర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఆఫీసర్లు టార్పాలిన్లు సరఫరా చేయకపోవడంతో వర్షానికి వడ్లు తడిసిపోకుండా చూసేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. గత్యంతరం లేక ప్రైవేట్‌లో టార్పలిన్లు అద్దెకు తెచ్చుకుని వడ్ల కుప్పల మీద కప్పుతున్నారు. త్వరగా కొనుగోళ్లు ప్రారంభించకుంటే రైతులు మరింత ఇబ్బంది పడే పరిస్థితి
కనిపిస్తోంది.