వరికి తెగులు.. రైతుల దిగులు .. ఒకే ఊరిలో 300 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

వరికి తెగులు.. రైతుల దిగులు .. ఒకే ఊరిలో 300 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

మెదక్, కొల్చారం, వెలుగు: చేతికందే దశలో ఉన్న వరి పైరుకు తెగుళ్లు సోకడంతో రైతులు దిగులు చెందుతున్నారు. యాసంగి సీజన్​లో జిల్లా వ్యాప్తంగా 2.46 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఆయా చోట్ల సాగు చేసిన వరి పంట కోతకు సిద్ధమైంది. ఈ దశలో పలు చోట్ల వరి పైరుకు తెగుళ్ల బెడద దాపురించింది. కొల్చారం, మెదక్​ మండలాల్లో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది. ప్రధానంగా తెల్లకంకి, అగ్గితెగులు, మెడవిరుపు సోకి వందలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. 

తెగుళ్ల నివారణకోసం రైతులు వేలాది రూపాయలు ఖర్చుచేసి మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడం లేదంటున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల పరిధిలో వరి పంటకు తెగుళ్లు సోకగా, ప్రధానంగా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ లో యాసంగి సీజన్ లో సాగు చేసిన వరి పంటకు ఎక్కువ మొత్తం తెగుళ్లు సోకాయి. ఈ ఒక్క గ్రామం పరిధిలోనే దాదాపు 300 ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పొలాల్లో మెడ విరుపు, తెల్ల కంకి, అగ్గితెగులు సోకింది. 

మెదక్ మండలం చిట్యాల, జానకంపల్లిలో వరి పంటకు తెగుళ్లు సోకాయి. వేలాది రూపాయలు ఖర్చుచేసి మందులు పిచికారీ చేసినప్పటికీ తెగుళ్లు తగ్గడం లేదంటున్నారు. తెగుళ్ల కారణంగా ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల పంట సాగు పెట్టుబడి కూడా చేతికందేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో వరి పైరుకు తెగుళ్లు సోకి పంటలు దెబ్బతింటున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్​ చేసినా స్పందించడం లేదని మండిపడుతున్నారు. మొన్నటి వరకు అకాల వర్షాలతో ఇబ్బంది పడగా, ఇపుడు తెగుళ్ల బెడద వల్ల తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. వరి పంటకు తెగుళ్లు సోకిన విషయమై మండల వ్యవసాయ అధికారి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. 

పెట్టుబడి నష్టపోయేటట్టున్నం  

నేను యాసంగిలో ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. మరి కొన్ని రోజుల్లో పంట చేతికందేది. అంతలో తెల్ల కంకి, మెడ విరుపు వచ్చి అంత పొల్లు అయింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలె. - మన్నె సోమయ్య, రైతు, నాయిని జలాల్ పూర్ 

ఏమి చేతికందేటట్టు లేదు

మూడెకరాల్లో వరి వేసిన. ఎకరాకు 25 వేల దాకా పెట్టుబడి అయింది. పంటంతా మొత్తం రోగం పడ్డది. పెట్టుబడి కూడా చేతికందేటట్టు లేదు. పొలం కోసినా కూలీల ఖర్చు కూడా వచ్చేటట్టు లేదు. ప్రభుత్వం పరి హారం చెల్లించి ఆదుకోవాలె.- గొల్ల పోచయ్య, రైతు, నాయిని జలాల్​పూర్​