పత్తా లేని లారీలు.. మిల్లులలోనే ఆగిన వెహికల్స్

  • సెంటర్లలోనే 15 వేల టన్నుల ధాన్యం 
  •  ఎదురు చూస్తున్న రైతులు
  •  వానలు పడుతాయని ఆందోళన

యాదాద్రి, వెలుగు: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు రాకపోవడంతో కాంటా పెట్టిన వడ్లు సెంటర్లలోనే ఉంటున్నాయి. ఎక్కడ వానపడుతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు సెంటర్లు ప్రారంభించి నెలలు గడుస్తున్నా వేగం పుంజుకోవడం లేదు. తేమ, తాలు పేరుతో లారీలను అన్ లోడ్​ చేయించకుండా మిల్లర్లు ఇబ్బందులు పెట్టారు. దీంతోపాటు గత నెలలో  కురిసిన అకాల వర్షాలతో కొనుగోళ్లు స్లోగా సాగుతున్నాయి. 3.28 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు ఇప్పటివరకూ 3.28 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. లెక్క ప్రకారం మరో 1.72 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే లోడుతో మిల్లులకు వెళ్లిన లారీలు అన్ లోడ్​ కాకపోవడంతో రోజుల తరబడి అక్కడే ఆగిపోతున్నాయి. దీంతో సెంటర్లకు లారీలు రావడం లేదు.

అయితే ఇప్పటికే కాంటా వేసిన 15వేల టన్నుల ధాన్యం బస్తాలు సెంటర్లలోనే ఉన్నాయి. కుప్పలుగా ఉన్న వడ్లను కాంటా వేయడం లేదు. దీనికి తోడు ఎండలు విపరీతంగా కొడుతుండడంతో కాంటా వేస్తే బరువు తగ్గే ప్రమాదముంది. మిల్లుకు వెళ్లిన సమయంలో మళ్లీ కాంటా వేస్తున్నందున తరుగు వచ్చే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. పైగా అప్పుడప్పుడు వానలు పడుతూ ఉండడంతో వడ్లు మళ్లీ తడుస్తాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో సెంటర్లో కాంటా పెట్టిన వడ్ల బస్తాలు 600 నుంచి 1500 మాత్రమే ఉన్నాయని, ఒకటి రెండు లారీలు వస్తే వెళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

మిల్లర్ల నయా ప్లాన్​

మిల్లుల్లో హమాలీలు లేక పోవడం వల్ల వెంటనే అన్ లోడ్​చేయడం లేదని అంటున్నప్పటికీ..  ఇదంతా మిల్లర్ల ప్లాన్​ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీలు ఆపి తేమ, తాలు పేరుతో తూకంలో కోత విధించాలన్నదే మిల్లర్ల ప్లాన్​ అని రైతులు అంటున్నారు. వడ్లను కాంటా వేయకపోవడం, వేసిన వడ్లకు ట్రాన్స్​పోర్ట్​ సమకూర్చకపోవడం వల్ల సెంటర్లలోనే రైతులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే వానాకాలం సాగు కోసం దున్నకాలు స్పీడ్​ కావాల్సి ఉంది. సెంటర్లలోనే రైతులు ఉండడం వల్ల దున్నకాలపై ప్రభావం పడుతోంది. దీంతో సాగు ఆలస్యమయ్యే అవకాశమందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా లారీల విషయంలో ఆఫీసర్లు జోక్యం చేసుకొని వెంట వెంటనే అన్ లోడ్​ జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.