నిజామాబాద్, వెలుగు : జిల్లా రైతులు యాసంగిలో కూడా సన్నరకం వడ్లు సాగుచేసేందుకు రెడీ అవుతున్నారు. వానాకాలం సీజన్లో ప్రభుత్వం ఎంఎస్పీకి అదనంగా రూ.500 బోనస్ఇవ్వడంతో రేటు గిట్టుబాటు అయ్యింది. దీంతో ఈసారి కూడా రైతులు సన్నాల వైపే మొగ్గు చూపుతున్నారు. సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట వేసే అవకాశం ఉండడంతో సాగునీటి అవసరం కూడా పెరగనుందని అంచనా వేస్తున్న ఇరిగేషన్ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ యాసంగి సీజన్లో జిల్లాలో మొత్తం 5.18 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అందులో 4.19 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 3.71 లక్షల ఎకరాలు మాత్రమే. గత ఏడాది యాసంగి లో మొత్తం 4.15 లక్షల ఎకరాల్లో వరి వేయగా అందులో 2.44 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. ఈ యాసంగిలో సన్నాల సాగు 3.80 లక్షల ఎకరాలకు పెరుగుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది.
వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులు కొనుగోలు కేంద్రాల్లో 4.90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అమ్మారు. అందులో సన్న వడ్లు 3 లక్షల టన్నుల వరకు ఉన్నాయి. రైతులకు వడ్డకు సంబంధించి మొత్తం రూ.736 కోట్ల పేమెంట్జరగగా.. అందులో సన్నాలకు ఇచ్చిన బోనస్అమౌంట్ రూ.75 కోట్లు. బోనస్ వల్ల తమ పంటకు గిట్టుబాటు ధర వచ్చిందని రైతులు సంతోషిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 3.80 లక్షల ఎకరాలకు సరిపడా సన్నరకాల వరినారు రెడీ చేశారు. బాన్సువాడ, బోధన్ సెగ్మెంట్లలో నాట్లు షురువయ్యాయి.
సాంబమసూరి 5204, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ 15048, కూనారం సన్నాలు (కేఎన్ఎం 73), ప్రద్యుమ్న, జేజీఎల్ 17004, గంగాకావేరి రకాల సన్నాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎరువులు, క్రిమిసంహారక మందులు సిద్ధం చేసింది. ఇరిగేషన్అధికారులు వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ సాగునీటి విడుదల ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ కూడా బోర్ల కింద సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. దొడ్డురకం వరి 120 రోజులకు కోతకు వస్తుంది. కానీ సన్నాలు కోతకు రావడానికి5 150 రోజులు పడుతుంది.
అదనంగా 30 రోజుల పాటు సన్నాలకు సాగునీటి అవసరం ఉంటుంది. అంటే సన్నాలకు కనీసం మూడు, నాలుగు తడులు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. దొడ్డు రకాలకన్నా సన్నాలకు చీడపీడల బెడద కూడా ఎక్కువే. దొడ్డు రకాలకు నాలుగుసార్లు పెస్టిసైడ్స్ కొడితే సన్నాలకు కనీసం ఆరుసార్లు స్ప్రే చేయాల్సిఉంటుంది. ఒక్కో సారి పెస్టిసైడ్ కొట్టాలంటే ఎకరానికి రూ 3 వేలు ఖర్చు అవుతుంది. పురుగుల మందులకే దాదాపు 18 వేలు ఖర్చవుతాయి. అయినా రేటు వస్తుందన్న ధీమాతో రైతులు సన్నాలకు సిద్ధమవుతున్నారు.