- భూములు తీసుకునే ముందు మాకు న్యాయం చేయండి
- ఇప్పటికే భూములు కోల్పోయి నష్టపోయాం
- మరోసారి భూములు, ఇండ్లు కోల్పోయి ఎక్కడుండాలి
గజ్వేల్, వెలుగు: ట్రిపుల్ఆర్సర్వే కోసం వచ్చిన అధికారులను సిద్దిపేట జిల్లా వర్గల్మండలం సామలపల్లి రైతులు సోమవారం అడ్డుకున్నారు. సోమవారం వర్గల్ మండలంలోని సామలపల్లి గ్రామంలో ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించేందుకు వెళ్లారు. గజ్వేల్ తూప్రాన్ రహదారికి ఇరువైపులా ఉన్న భూమితోపాటు స్థిర, చరా ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆర్ అండ్ బీ అధికారులు చేరుకున్నారు.
భూములు కోల్పోతున్న బాధిత రైతులు, గ్రామస్తులు తమకు న్యాయం చేసేవరకు సర్వే చేపట్టొద్దని అధికారులను అడ్డుకున్నారు. కొందరు రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఇప్పటికే కాలువలు, రహదారుల నిర్మాణంతో కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కోల్పోయామన్నారు. ఈ సారి భూములతో పాటు ఇళ్లను కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.3 కోట్లకు పైగా ఎకరం భూమి విలువ ఉందని, తాము అంతవిలువైన భూములు కోల్పోతే ఇచ్చే పరిహారంతో గుంట భూమి కూడా కొనుగోలు చేయలేమని వాపోయారు.
తమకు తగిన న్యాయం జరిగితేనే తమ భూములను ఇస్తామని చెప్పి, గ్రామస్తులు, రైతులు అధికారులను అక్కడ నుంచి వెనక్కి పంపించేశారు. విషయం తెలుసుకున్న బేగంపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు.