- ఏదో ఒక రోడ్డుకింద పోతున్న నాలుగు గ్రామాల రైతుల భూములు
- సొంత భూములకు డిమాండ్ కోసం పెద్ద రోడ్ల కుట్రల్లో గులాబీ లీడర్లు
- ఆందోళన బాటలో ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, దామెర రైతులు
వరంగల్, వెలుగు: వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోని ఆరెపల్లి, కొత్తపేట గ్రామాలు కలిసే ప్రతిమ, ఎన్ఎస్ఆర్ హాస్పిటళ్ల జంక్షన్ అది. ఓరుగల్లు ఆరు జిల్లాల్లో ఎక్కడాలేని విధంగా ఒకేచోట నేషనల్ హైవే_163, గ్రేటర్ వరంగల్200 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్, 300 ఫీట్ల ఔటర్ రింగ్ రోడ్, 120, 100 ఫీట్ల రెగ్యూలర్ రోడ్లతోపాటు మరో రెండు, మూడు రోడ్లు కేవలం పావుకిలో మీటర్ దూరంలో వస్తున్న జంక్షన్ ఇది.
ఏండ్ల తరబడి సాగునే నమ్ముకుని బతుకుతున్న దాదాపు నాలుగు గ్రామాల రైతుల భూములు ఇప్పుడు ఇందులో ఏదో ఒక రోడ్డుకింద పోతున్నాయి. అయితే ఇవన్నీ కేవలం అభివృద్ధి కోణంలో కాకుండా గత ప్రభుత్వ హయాంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల భూములకు డిమాండ్ల తీసుకొచ్చే క్రమంలో పోవడమే ఇప్పుడు రైతుల ఆందోళనకు కారణమైంది.
ప్రతిమ హాస్పిటల్ వద్దకే.. అన్ని పెద్ద రోడ్లు
గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎంకు దగ్గరగా ఉండే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు ఆరెపల్లి, కొత్తపేట ప్రాంతంలో ప్రతిమ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి ఎటువైపు నుంచి వచ్చినా, ఈ ఆస్పత్రి చేరేలా అప్పట్లో రోడ్ల ప్రతిపాదనలు జరిగాయి. హైదరాబాద్, కరీంనగర్ నుంచి ఈ ఆస్పత్రిని ఆనుకునే భూపాలపల్లితోపాటు ములుగు మీదుగా చత్తీస్‌గఢ్‌కు వెళ్లే 200 ఫీట్ల నేషనల్ హైవే_163 వచ్చింది.
Also Read :- సాక్ష్యాలు చెరిగిపోవు.. పోలీసు శాఖలో ఈ సాక్ష్య యాప్
గతంలో హనుమకొండ సిటీ నుంచి ములుగు వెళ్లేవారు 120 ఫీట్ల రోడ్డు మీదుగా హైవే ఎక్కడానికి ఇదే ఆస్పత్రి ప్రాంతాన్ని జంక్షన్‌గా చేశారు. వరంగల్ సిటీ మీదుగా ఏనుమాముల మార్కెట్, కొత్తపేట మీదుగా వచ్చే 100 ఫీట్ల రోడ్డును ఇదే జంక్షన్‌కు చేరుకునేలా కలిపారు. దీనికి నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచే నాగపూర్ నుంచి విజయవాడ వెళ్లే నేషనల్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్లనున్నది.
200, 300 ఫీట్ల రోడ్లతో మాజీ ఎమ్మెల్యేల కుట్ర
మాజీ ఎంపీ ప్రతిమ ఆస్పత్రి ప్రాంతానికి డిమాండ్ పెరిగేలా పెద్ద రోడ్లు రావడంతో, పనిలోపనిగా అప్పటి లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి చుట్టూరా ఉండే ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, దామెరలో వందలకొద్ది ఎకరాల పనికిరాని భూములను అగ్వకు కొన్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్నుంచి ప్రతిమ, ఎన్ఎస్ఆర్ ఆస్పత్రుల జంక్షన్ చేరుకోవడానికి అందుబాటులో కొత్తపేట మీదుగా 100 ఫీట్ల రోడ్డు ఉన్నా, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ భూములకు లాభం చేకూర్చడానికి దీని పక్కనుంచే మళ్లీ 200 ఫీట్ల బైపాస్ రోడ్డును అలైన్మెంట్ మార్చారు.
ఇది మళ్లీ మాజీ ఎంపీ హాస్పిటళ్ల జంక్షన్ చేరేలా రూటు మారింది. పనిలోపనిగా మరో లీడర్ హాస్పిటల్, స్కూల్కు మేలు చేరేలా రోడ్డును అడ్డదిడ్డంగా రైతుల సాగు భూముల్లోంచి తిప్పారు. వీటిపైనే ఇప్పుడు రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ రోడ్లకు అడుగు దూరం నుంచే ఇతర మాజీ ఎమ్మెల్యేల భూముల కోసం మళ్లీ 300 ఫీట్ల రోడ్డు ప్రతిపాదనలు పెట్టారు.
ఆఫీసర్లు భూముల సర్వే నంబర్లను రోడ్లకింద చూపడంతో బాధితులు అమ్మడానికి, కొనడానికి, చివరకు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వట్లేదని రైతులు వాపోతున్నారు. నాలుగెకరాల తన భూమిని కోల్పోతున్న దయ్యాల రాజబీరయ్య అనే రైతు మానసిక వ్యధతో గుండెపోటుతో మరణించారు.
గూగుల్ మ్యాప్ ఆధారంగా పచ్చని గుండ్రటి ఆకారంలో ఉన్న స్థలం హనుమకొండ నుంచి ములుగు వైపు వెళ్లే క్రమంలో ఆరెపల్లి, దామెర క్రాస్ వద్ద ఓ వైపు ప్రతిమ హాస్పిటల్, మరో వైపు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్.
1 నంబర్ రోడ్ : హైదరాబాద్, కరీంనగర్, హసన్పర్తి మీదుగా వచ్చే నేషనల్ హైవే_163 రోడ్ దామెర క్రాస్ ప్రతిమ హాస్పిటల్ వద్ద..
2 నంబర్ రోడ్: ప్రస్తుతం హనుమకొండ ములుగురోడ్ జంక్షన్ నుంచి పరకాల, ములుగు వైపు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న 120 ఫీట్ల రోడ్
3 నంబర్ రోడ్: ప్రస్తుతం ప్రతిమ, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్ (కొత్తపేట జంక్షన్) నుంచి ఏనుమాముల మార్కెట్ వెళ్లేందుకు వేసిన 100 ఫీట్ల రోడ్
4 నంబర్ రోడ్: ప్రతిమ, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వద్దకు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ భూముల నుంచి ప్రతిపాదించిన 200 ఫీట్ల ఇన్నర్ బైపాస్ రోడ్
5 నంబర్ రోడ్: ప్రతిమ హాస్పిటల్‌కు అడుగు దూరంలోనే ప్రతిపాదించిన 300 ఫీట్ల ఔటర్ రింగ్‌రోడ్
6 నంబర్ రోడ్: ప్రతిమ హాస్పిటల్ నుంచి దామెర మండల కేంద్రానికి వెళ్లే రోడ్
7 నంబర్ రోడ్: ఆరెపల్లి నుంచి వంగపహాడ్ వెళ్లే రోడ్
లీడర్ల భూముల కోసం రూట్ మార్చారు..
నేషనల్ వైవేలు, 100, 200, 300 ఫీట్ల రోడ్లు వేసే క్రమంలో మధ్యన కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటది. ఇక్కడ మాత్రం రోడ్డు పక్కనే మరో పెద్ద రోడ్డు వేస్తున్నారు. కొత్తపేట జంక్షన్ నుంచి ఏనుమాముల మార్కెట్ దారిలో 100 ఫీట్ల రోడ్డు ఉంది. బీఆర్ఎస్ లీడర్లు ఇక్కడి 200 ఫీట్ల బైపాస్ రోడ్డును తమ భూముల మీదుగా ఇద్దరు లీడర్లకు చెందిన ఆస్పత్రుల వద్దకు వచ్చేలా మార్చారు. సుంకరి ప్రశాంత్, ఆరెపల్లి