వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నిరసనలు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నిరసనలు

తెలంగాణ రాష్ట్రంలో రైతులు అరిగోస పడుతున్నారు. అటు వడ్లకు గిట్టుబాటు కాక.. ఇటు అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం రాక నానా తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో వడ్లు సకాలంలో కాంటాలు పెట్టడం లేదు. కొన్నిచోట్ల వడ్లు తెచ్చినంక నెల రోజులకు గానీ జోకుతలేరు. చివరకు రైతులు రోజుల తరబడి ఎదురుచూసినంక కాంటా పెడ్తున్నా తాలు, తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారు. ఈ బాధలు భరించలేక కొందరు రైతులు వడ్లను కల్లాల్లోనే ప్రైవేట్ వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నారు. 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్ గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిరసన చేపట్టారు. దాదాపు రెండు నెలలు గడిచినా ఇప్పటికీ కాంటాలు వేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వడ్ల బస్తాలను తరలించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి.. నిరసన తెలిపారు. వడ్ల బస్తాలను తగలబెట్టి ఆందోళన చేశారు. 

రైతుల ధర్నా

జనగామ మండలం వడ్లకొండలోనూ రోడ్డుపై రైతులు ధర్నా చేపట్టారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 40 వేల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 

పట్టించుకోని రైస్ మిల్లర్లు 

మరోవైపు.. మహబూబాబాద్ పట్టణంలో పలు రైస్ మిల్లలు వద్ద ధాన్యం లోడ్ తో వాహనాలు బారులు తీరాయి. దాదాపు ఐదు రోజులవుతున్నా రైస్ మిల్లర్లు పట్టించుకోవడం లేదు. దీంతో వాహనాదారులు, రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.