మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా రైతుల ధర్నా

  • అభ్యంతరాలు ఇయాల్టికే లాస్ట్​
  • మున్సిపల్​ఎదుట ధర్నా చేస్తామని రైతుల ప్రకటన

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ముసాయిదా మాస్టర్​ ప్లాన్​పై అభ్యంతరాల గడువు బుధవారంతో ముగియనుంది. ప్లాన్​కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో పాటు, ప్లాన్​ మార్చాలని డిమాండ్​ చేస్తూ  రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత అధికారులు, లీడర్లు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 1,026 అభ్యంతరాలు వచ్చాయి. ఇంకా కూడా వచ్చే అవకాశముంది. ప్లాన్​లో ప్రతిపాదించిన ఇండస్ర్టియల్ జోన్​, గ్రీన్ ​జోన్​, 100 ఫీట్ల పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు మున్సిపాల్టీతోపాటు, కలెక్టర్​కు అభ్యంతరాలు ఇచ్చారు. వీటన్నింటిని మున్సిపల్​ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్లాన్​ ను ఆమోదిస్తే.. ఆయా వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరో వైపు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని మార్చులపై పరిశీలన చేయాలని ఇటీవల మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.

అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ చెబుతున్నారు. అభ్యంతరాల గడువు ముగిసిన తర్వాత వీటన్నింటిపై ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు, కౌన్సిల్​ మీటింగ్​ కూడా ఏర్పాటు చేసి చర్చించాల్సి ఉంది. రైతులు భారీ ఆందోళనలతో పాటు 49 మంది కౌన్సిలర్లను కలిసి ప్రస్తుత మాస్టర్​ ప్లాన్​ను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. మరో వైపు రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. సోమవారం హైకోర్టులో కేసు విచారణకు కూడా వచ్చింది. మాస్టర్​ ప్లాన్​పై ప్రభుత్వ వాదనలు తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. 

నేడు మున్సిపల్​ ఎదుట రైతుల ధర్నా

మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా బుధవారం మున్సిపల్​ ఆఫీసు ఎదుట ధర్నా చేయాలని రైతు ఐక్య కార్యచరణ కమిటీ నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు గడువు చివరి రోజు ఉన్న దృష్ట్యా రైతులు ధర్నా చేస్తున్నారు.