నాట్లు వేయట్లే  టార్గెట్ 2.85 లక్షల ఎకరాలు

నాట్లు వేయట్లే  టార్గెట్ 2.85 లక్షల ఎకరాలు
  •     జిల్లాలో వర్షాభావ పరిస్థితులు 
  •     సాధారణం కంటే  12 మిల్లీ మీటర్ల లోటు 
  •     పత్తి రైతుల్లో ఆందోళన
  •     చెరువుల్లో చేరని నీరు..బావులు, బోర్లలో తగ్గిన నీటిమట్టం

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో వరి నాట్లు వేయడానికి రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకపోవడంతో లోటు వర్షపాతం నమోదైంది. చెరువుల్లో నీరు చేరలేదు. బావులు, బోరుబావుల్లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో వ్యవసాయపనులు మందగించాయి. ఇప్పటికే వితనాలు వేసిన పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. 

50 వేల ఎకరాల్లో నాట్లు.. 

జిల్లాలో గతేడాదిలో సమృద్ధిగా వానలు కురవలేదు. దీంతో గత వానాకాలం, యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తారని అంచనా వేసిన అగ్రికల్చర్​ఆఫీసర్లు.. ఈసారి వానాకాలంలో సాగు అంచనాలను 2.85 లక్షలకు తగ్గించారు. జిల్లాలోని 17 మండలాల్లో భూదాన్​పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో మూసీ నీటితో పంటలు పడిస్తారు. మిగిలిన 14 మండలాల్లో ఎక్కువగా బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం సాగుతోంది. కాలం మంచిగా అవుతుందున్న ఆశతో 1, 82, 244 ఎకరాల్లో రైతులు నారు పోశారు.

సీజన్ లో వానలు భారీగా కురుస్తాయంటూ వాతావరణశాఖ చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఎక్కడా కురువలేదు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నా.. చివరకు చిటపట చినుకులు మాత్రమే కురుస్తున్నాయి. దీంతో బావులు, బోర్ల నుంచి మోటార్లు ఆగి ఆగి నీరు పోస్తున్నాయి. జిల్లాలోని మూసీ పరీవాహక  ప్రాంతాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో రైతులు నాట్లు వేయగా, మిగిలిన ప్రాంతాల్లో 20 వేల ఎకరాల్లోనే కొందరు రైతులు నాట్లు వేశారు. ఆగస్టు నాటికి నాట్లేసే సమయం ఉన్నా.. ముందు ముందు వానలు పడతాయా..? లేదా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

90 వేలకు పైగా బోర్లు.. 

జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 151.8 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు 132.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్​లో ఇప్పటివరకు 12 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. భారీ వానలు కురవకపోవడం వల్ల జిల్లాలోని దాదాపు 1300 చెరువులు, కుంట్లలో నీరు సరిగా చేరలేదు. కొన్ని చెరువుల్లో పది శాతం నీరు కూడా లేదు. అదే విధంగా 90 వేలకు పైగా బోర్లు, 9 వేలకు పైగా బావుల్లో నీటిమట్టం తగ్గిపోయింది. 

గతేడాది కంటే తగ్గిన భూగర్భ జలాలు.. 

ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో భూగర్భజలాలు తగ్గిపోయాయి. అడపదడపా కురిసిన వానల కారణంగా మే 2024 కంటే ఈనెలలో 0.23 మీటర్ల భూగర్భ జలాలు కొద్దిగా పెరిగినా.. గతేడాది ఈ సీజన్​ కంటే జలాలు మరింత కింది పడిపోయాయి. గతేడాది జూన్​లో 7.83 మీటర్ల లోతుల్లో జలాలు ఉండగా, ఈ ఏడాది జూన్​లో 10.41 మీటర్ల దిగువనే భూగర్భ జలాలు ఉన్నాయి. గతేడాది​కంటే 2.58 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయని  గ్రౌండ్​వాటర్​డిపార్ట్​మెంట్​వెల్లడించింది. 

పత్తి రైతుల్లో ఆందోళన.. 

జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని అగ్రికల్చర్​ఆఫీసర్ల అంచనా వేశారు. ఈసారి ఇప్పటికే 1.05 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. వానలకు పడకపోవడంతో కొన్నిచోట్ల వేసిన విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. దీంతో మరోసారి విత్తనాలు వేసిన సందర్భాలున్నాయి. ఈనెల 20లోపు విత్తనాలు వేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సరైన వానలు పడలేదు.