33 వేల 398 రైతులకు అందని రైతు బంధు

  • తొమ్మిది సీజన్లలో 1,84,320 ఖాతాల్లో జమ కాలే
  • ఫిర్యాదులు చేస్తున్న రైతులు.. సమస్యపై స్పష్టత ఇవ్వలేకపోతున్న ఆఫీసర్లు 
  • యాదాద్రి జిల్లాలో పరిస్థితి ఇదీ.. ఆందోళనలో లబ్ధిదారులు 

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో యాసంగి ముగిసినా ఈ సీజన్​కు సంబంధించిన రైతుబంధు ఇంకా చాలా మంది రైతులకు అందలేదు. ఈ విష యమై పలుమార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోవడం లేదు. సమస్యపై సరైన స్పష్టత కూడా ఇవ్వడం లేదు. దీంతో బాధిత రైతులు తమకు పెట్టుబడి సాయం అందదేమోనని ఆందోళన చెందుతున్నారు. 

పరిస్థితి ఇదీ... 

యాసంగి- 2022–-23 సీజన్​లో యాదాద్రి జిల్లాలో రైతుబంధు లబ్ధిదారులు 2,61,052 మంది  ఉన్నారని ఆఫీసర్లు ప్రకటించారు. వీరికి పెట్టుబడి సాయంగా 303.80 కోట్లు అందుతుందని చెప్పారు. ఫిబ్రవరి 2023 నాటికి 2,25,630 ఖాతాలకు రైతుబంధు సొమ్ము జమ అయింది. గతంలో బ్యాంకులు విలీనం కావడం వల్ల ఇటీవల ఐఎఫ్‌ఎస్సీ నంబర్లు మారిపోయాయి. దీంతో  1964 మందికి రైతుబంధు ట్రాన్స్​ఫర్​ ఫెయిలైంది. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు ఐఎస్​ఎస్సీ సరి చేయడంతో తాజాగా వీరికి రైతుబంధు సొమ్ము 2.56 కోట్లు జమ అయింది. మొత్తంగా ఈ సీజన్​లో 2,27,654 మందికి పెట్టుబడి సాయంగా  రూ. 267. 20 కోట్లు అందింది. ఇంకా 33,398 మందికి రైతుబంధు సొమ్ము జమ కాలేదు. 

10 నుంచి 15 ఎకరాలు ఉన్నోళ్లకు పడలే..

ఈ యాసంగి సీజన్​లో 10 ఎకరాల నుంచి 15 ఎకరాల మధ్య భూమి ఉన్న  3582  నుంది రైతుల ఖాతాల్లో ఇంకా రైతుబంధు జమ కాలేదు. 16 ఎకరాల నుంచి ఆపై భూమి ఉన్న రైతులకు రైతుబంధు జమ కావడం గమనార్హం. ఈ విషయంలో అగ్రికల్చర్​ ఆఫీసర్లు కూడా తమ చేతిలో ఏం లేదని, ఏం చేయలేమని చెబుతున్నారు తప్ప సమస్యపై స్పష్టత ఇవ్వడం లేదు. కాగా కొత్తగా భూమిని కొనుగోలు చేసిన వారికి కూడా రైతుబంధు జమ కాలేదు. వీరు జిల్లా వ్యాప్తంగా 29,816 మంది రైతులున్నారు.  వీరు అప్లయ్​ చేసుకోవడానికి గతేడాది డిసెంబర్​ 20 నుంచి అవకాశం కల్పించింది. అయితే వీరికి సంబంధించిన డిటేయిల్స్​ సీసీఎల్​ఏ నుంచి అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​కు రాలేదు. పైగా అప్పట్లో  సైట్​సరిగా ఓపెన్​ కాకపోవడంతో పాటు కొత్త లబ్ధిదారుల పేర్లను ఎంట్రీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ సీజన్​లో ఈ కొత్త రైతులకు రైతుబంధు పొందే అవకాశమే లేకుండా పోయినట్టుగా తెలుస్తోంది. 

ప్రతి సీజన్​లోనూ ఇంతే..  

2018 ముందస్తు ఎన్నికల ముందు ప్రభుత్వం రైతుబంధు స్కీం ప్రారంభించింది. మొదట్లో ఎకరానికి రూ. 4 వేలు ఇస్తామని చెప్పిన సర్కారు.. ఆ తర్వాత ఎకరానికి రూ. 5 వేలు చేసింది. 2018 రెండు సీజన్లలో తక్కువ ఎకరాల్లో ఉన్న రైతుల ఖాతాల్లో త్వరగా జమ చేసి ఎక్కువ ఎకరాలు కలిగిన రైతులకు ఆలస్యం చేసింది. ఈ విషయమై కొందరు పెద్ద రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం రైతులందరికీ వెనువెంటనే రైతుబంధు జమ చేస్తోంది. కానీ ప్రతి సీజన్​లో  ఏదో ఒక కారణంతో 20 వేల నుంచి 30 వేల మంది రైతు ఖాతాల్లో రైతుబంధు జమ చేయడం లేదు. 2018 వానాకాలం సీజన్​ నుంచి 2022–-23 యాసంగి సీజన్​ నాటికి 21,35,088 ఖాతాల్లో రైతుబంధు జమ కావాల్సి ఉండగా 19,50,268 ఖాతాల్లో మాత్రమే జమ అయింది. మరో 1,84,320 ఖాతాల్లో రూ. 77.57  కోట్లు ఇంకా జమ కాలేదు. 

ఇంకా పైసలు పడలే.. 

నాకు 12 ఎకరాల భూమి ఉంది. గతంలో రైతుబంధు వచ్చింది. ఈ యాసంగి రైతు బంధు మాత్రం ఇంకా పడలే. ఎప్పుడిస్తరో కూడా చెప్పట్లే.. సారోళ్లను అడిగితే కొందరు రైతులకు రైతుబంధు రాలేదన్న సంగతే చెబుతున్నరు.. ఎందుకు వస్తలేద నేది సరిగా చెప్తలేరు. ఏంజేయలో తోస్తలే.. 
- సోమయ్య, బొందుగుల, రాజాపేట మండలం