- వానాకాలం సీజన్లో పెరగనున్న సాగు
- రూ.500 బోనస్ ప్రకటించడమే కారణం
- 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా
- సన్నాల సీడ్‌కు పెరిగిన డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని రేవంత్ సర్కారు ప్రకటించడంతో సన్న రకం సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వరి నార్లు పోసుకుంటున్నారు. సన్నాల సాగుకు డిమాండ్ పెరగడంతో డీలర్లు ఒక్కసారిగా సీడ్ రేట్లు పెంచేశారు. పది కిలోల బ్యాగుకు రూ.50 నుంచి రూ.100 దాకా, 25 కిలోల బ్యాగుకు రూ.120 దాకా పెంచి అమ్ముతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సన్నాల సాగు పెరుగుతున్నందున ఆ మేరకు సన్న బియ్యం రేట్లు దిగిరావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెరగనున్న సన్నాల సాగు
రాష్ట్రంలో రైతులు అత్యధికంగా వరి సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వానా కాలంలో 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. సన్న రకం వరి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ సమయంలో బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో సన్న రకం సాగు చేయడానికి రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ వానాకాలం సీజన్ నుంచే ఈ పథకం అమలు చేయాలని సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సన్న రకం వరి సాగు గణనీయంగా పెరగనున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు సన్నబియ్యం సప్లై చేస్తున్నది.
25లక్షల టన్నుల మేర సన్న బియ్యం డిమాండ్
రాష్ట్ర వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యాన్నే సరఫరా చేయాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తున్నది. దీంతో రాష్ట్రంలో 25 లక్షల టన్నుల మేరకు సన్న బియ్యం డిమాండ్ ఏర్పడింది. అయితే, డిమాండ్ కు తగ్గ సన్న బియ్యం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు సన్న రకాల సాగును దాదాపుగా మానుకుంటున్న టైమ్‌లో రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యాన్ని ఇక్కడే పండించేలా ప్రోత్సహించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఈ యేడు సాగు టార్గెట్‌లో 50శాతానికి పైగా సన్నాలే సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. తాజా పరిణామాలతో సన్నాల వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
పది శాతం పెరిగిన సీడ్ ధరలు
సన్న రకం వరి సీడ్ కు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రైవేటు కంపెనీలు బ్రాండ్ల పేరిట ధరలను పది శాతం వరకు పెంచేశాయి. తెలంగాణ సోనా 10 కిలోల బ్యాగు నిరుడు రూ.650 ఉంటే ఇప్పుడు రూ.700 వరకు ఉంది. గతేడాది వెయ్యి లోపు ఉన్న 1008 రకం సన్న బియ్యం పది కిలోల సీడ్ బ్యాగ్ ఇప్పుడు రూ.1,050 పలుకుతున్నది. సూపర్ అమన్ రకం రూ.850కి పెంచారు. ఇక 25, 30 కిలోల బస్తాల సర్టిఫైడ్ వరి విత్తనాల కోసం అదనం రూ.100 నుంచి రూ.120 వరకు చెల్లించాల్సి వస్తున్నది. పత్తి మినహా మిగతా పంటల విత్తనాల విక్రయాలపై ప్రభుత్వం ధరల నియంత్రణ లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వివిధ సీడ్ కంపెనీలు బీపీటీ, ఆర్ఎన్ఆర్, ఎంటీయూ, కేఎన్ ఎంఐఆర్, జేజేఎల్ తదితర రకాల సీడ్ ధరలను పెంచి ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ రాయితీ కూడా లేకపోవడంతో అన్నదాతలపై అదనపు భారం పడుతున్నది.
గతంలో ఆసక్తి చూపని రైతులు
కొన్నేండ్లుగా వర్షాకాలంలో 25 నుంచి 30 శాతానికి మించి సన్న రకం సాగు జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు మించి సన్న వరి సాగు కాలేదు. మూడేండ్ల కింద అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్న వరి రకాలు వేయాలని, బోనస్ ఇస్తామని చెప్పినా అమలు చేయలేదు. దీంతో రైతులు సన్న వడ్లు మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం వద్దన్నా దొడ్డు రకాలే సాగు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.
సన్నాలకు డిమాండ్ ఎక్కువే..
ధర విషయానికి వచ్చేసరికి మార్కెట్లో సన్నాలకు విపరీతంగా డిమాండ్ ఉంది. దొడ్డు రకంతో పోలిస్తే సన్న రకం వడ్లు క్వింటాలు దాదాపు రూ.600 ఎక్కువ ధర లభిస్తున్నది. గత యాసంగిలో సన్నాలు సాగు చేసిన రైతులంతా తమ పొలాల వద్దే పంటను అధిక ధరకు అమ్ముకున్నారు. సన్నాలు మార్కెట్లో రూ.2,500 వరకు ధర పలికింది. మార్కెట్‌కు వెళ్లకుండానే పొలాల వద్దే ప్రైవేటు వ్యాపారులు సన్నవడ్లు కొన్నారు. మార్కెట్లో క్వింటాల్ సన్న బియ్యం రూ.6వేల వరకు పలుకుతున్నది. తాజా నిర్ణయంతో మార్కెట్లో ధర రాకపోతే సర్కారుకైనా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో సన్న రకాలను తినే కుటుంబాలే 80 శాతానికిపైగా ఉండడంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే కాకుండా బయట మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలవుతుందని అగ్రి ఎక్స్పర్ట్స్ అంటున్నారు.