
- 2013 చట్టం ప్రకారం పరిహారమిస్తమంటున్న అధికారులు
- భూమే కావాలని పట్టుబడుతున్న రైతులు
- ఎటూ తేల్చని గ్రామసభలు
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ సమీపంలో ప్రభుత్వం సేకరించాలని భావించిన భూదాన్ భూ పరిహారంపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ భూములకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని అధికారులు చెబుతుంటే రైతులు మాత్రం తమకు భూమికి భూమే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఇటీవల రైతులతో నిర్వహించిన గ్రామసభల్లోనూ ఎలాంటీ నిర్ణయం ఫైనల్ కాలేదు.
ఇదీ పరిస్థితి..
గజ్వేల్, సంగుపల్లి, ధర్మారెడ్డి పల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 696 సర్వే నంబరు నుంచి 710 సర్వే నంబరు వరకు దాదాపు 185 ఎకరాల భూదాన్ భూములున్నాయి. దాదాపు 70 ఏండ్ల కింద భూదానోద్యమంలో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన ఇద్దరు భూ స్వాములు ఒక్కో రైతుకు ఎకరం నుంచి మూడెకరాల లోపు పంపిణీ చేశారు. అప్పటి నుంచి రైతులు వాటిని సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అయితే మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం భూదాన్ భూముల్లో నుంచి 84.23 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా గజ్వేల్ నుంచి తుఫ్రాన్ రోడ్డులోని సంగుపల్లి వద్దనున్న భూదాన్ భూమిని సేకరణ కోసం అధికారులు కొద్ది కాలం నుంచి కసరత్తు ప్రారంభించారు.
సేకరించిన ఎకరం భూమికి 600 గజాల ప్లాటు రైతులకు కేటాయించి రిజిస్ట్రేషన్ తో పాటు అన్ని హక్కులను కల్పిస్తామని అధికారులు మొదట హామీ ఇచ్చారు. కానీ ఇటీవల రైతులతో రెండు సార్లు గ్రామసభలు నిర్వహించి ప్లాట్ కు బదులు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇస్తామనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీన్ని రైతులు వ్యతిరేకించారు. పరిహారానికి బదులు భూమికి భూమినే కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. కానీ అధికారులు దీనిపై ఎలాంటీ హామీ ఇవ్వలేదు.
విలువైన భూములు..
గజ్వేల్ పట్టణ సమీపంలోని సాగు లో ఉన్న విలువైన భూదాన్ భూముల్లో రైతులు వివిధ రకాలైన పంటలు పండిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.2 కోట్ల పై చిలుకు ధర పలుకుతోంది. అధికారులు సూచించిన 2013 చట్టం ప్రకారం పరిహారం రూ.20 లక్షలకు మించదు. అందువల్లే భూమికి భూమే ఇవ్వాలనే డిమాండ్ ను బాధిత రైతులు ముందుకు తెచ్చారు.
పెండింగ్ లో మెగా లే అవుట్
భూదాన్ భూములను సేకరించి మెగా లే అవుట్ లు తయారు చేయాలనే ఆలోచనకు అధికారులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. మెగా లేఅవుట్ లో రైతుల నుంచి ఎకరం భూమిని సేకరిస్తే 600 గజాల ప్లాట్ పై సర్వ హక్కులు కల్పిస్తామని గతంలో అధికారులు ప్రతిపాదించారు. మొత్తం 185 ఎకరాల భూదాన్ భూములను సేకరించి మెగా లే అవుట్లు ఏర్పాటు చేయాలని మొదట నిర్ణయించారు. అయితే ఇప్పటికే సిద్దిపేట పట్టణంలో సుడా ఆధ్వర్యంలో మిట్టపల్లి వద్ద మెగా లే అవుట్ కు ఆదరణ దక్కక పోవడంతో గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథార్టీ (గడా) ఆధ్వర్యంలో చేపట్టాలనుకున్న మెగా లే అవుట్ ను పక్కన పెట్టిసినట్టు సమాచారం.
భూమే కావాలి
మాకు జీవనాధారమే ఈ భూములు. వీటిని తీసుకుంటే మా బతుకులు ఆగమైతయి. ఒకవేళ తీసుకుంటే ఈ భూములకు బదులు ఇంకోచోట భూమినే ఇవ్వాలి. ఎన్ని చట్టాల ప్రకారం పరిహారం ఇస్తామన్నా ఒప్పుకునేది లేదు.
- వ్యాసారం స్వామి, సంగుపల్లి
రైతులతో చర్చిస్తున్నాం
మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం 84 ఎకరాల భూదాన్ భూములను సేకరించాలని నిర్ణయించాం. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. కానీ వారు భూమికి భూమే ఇవ్వాలంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం.
- బన్సీలాల్, ఆర్డీవో గజ్వేల్