తప్పుడు పత్రాలు సృష్టించి తమ వ్యవసాయ భూములను ఆక్రమించుకుంటున్నారని ఓ రైతు కుటుంబం ఎమ్మార్వోకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ గ్రామంలో జరిగింది. నానాజీపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 233, 234 లో ఉన్న తమ వ్యవసాయ భూములకు సంబంధించి.. అదే గ్రామానికి చెందిన పిట్టల కృష్ణతో పాటు మరి కొందరు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పిట్టల శ్రీరాములు కుటుంబం ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేసింది.
రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేసి రికార్డుల్లోంచి తమ పేర్లు తొలగించారని బాధితులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. భూమి హక్కు పత్రాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో మొదటి నుండి తన పేరు ఉన్నప్పటికీ ఇటీవల తమ పేర్లను తొలగించి తప్పుడు రికార్డులను సృష్టించి ఆక్రమించుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ బాధిత రైతులు ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.