పాలేరు పాత కాలువ గేట్లను ఎత్తిన రైతులు

  •     పంటలకు నీళ్లు సరిపోవడం లేదనే...
  •     అధికారులు, పోలీసులతో వాగ్వాదం 
  •     ఖమ్మం–సూర్యాపేట రోడ్డుపై రాస్తారోకో

కూసుమంచి, వెలుగు:  ఖమ్మం జిల్లా కూసు మంచి మండలంలో పాలేరు రిజర్వాయర్​పాత కాలువ గేట్లను రైతులు, రైతు సంఘ నాయకులు ఎత్తి నీళ్లను విడుదల చేసుకున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పాత కాలువ ఆయకట్టు కింద రైతులు వరి, చెరుకు, ఇతర పంటలు సుమారు 20వేల ఎకరాల్లో  సాగు చేశారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుండడంతో నీటిని విడుదల చేయాలని అధికారులను అడిగితే స్పందించలేదు. దీంతో రైతు సంఘ నాయకులతో కలిసి మంగళవారం ఖమ్మం-సూర్యాపేట రోడ్డుపై రాస్తారోకో చేశారు. తర్వాత రిజర్వాయర్​దగ్గరకు వెళ్లి గేట్లు ఎత్తి సుమారు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్నారు. దీంతో ఐబీ ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, ఖమ్మం రూరల్​ఏసీపీ తిరుపతిరెడ్డి, ఐబీ ఆఫీసర్లు ఈఈ అననీయ, డీఈ మధు, మిషన్​భగీరథ సీఈ, రూరల్​సీఐ రాజిరెడ్డి, ఎస్సైలు కిరణ్​కుమార్, నాగరాజు, గిరిధర్​రెడ్డి తదితరులు రైతు సం ఘం నాయకులతో మాట్లాడారు. 

నీళ్లు తాగడానికే సరిపోవడం లేదని, సాగుకు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. రిజర్వాయర్​లో ప్రస్తుతం14.20 అడుగుల నీటిమట్టం ఉందని, మరో 15 రోజుల్లో11 అడుగుల డెడ్​స్టోరేజీకి చేరుకుంటుందని, అప్పుడు తాగడానికి కూడా అవకాశం ఉండదన్నారు. సమస్యను అర్థం చేసుకోవాలన్నారు. చివరకు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో గేట్లను క్లోజ్​ చేశారు. రైతు సంఘం లీడర్లు రాజు, సన్మాంతరావు, గంగాధర్​, రమణారెడ్డి, గురుమూర్తి పాల్గొన్నారు.