- సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని స్థానికుల ఆగ్రహం
- రైతులకు సమాచారం ఇచ్చామంటున్న అధికారులు
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో అధికారుల ముందు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. భూమిని కోల్పోతున్న రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. రైతులు, స్థానిక ప్రజల గొడవతో ఎలాంటి స్పష్టత లేకుండానే అధికారులు మీటింగ్ ముగించారు.
జిల్లాలోని తీర్ధాల నుంచి రఘునాథ పాలెంలోని వెంకటాయపాలెం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. మూడు మండలాల్లో ఎనిమిది రెవెన్యూ గ్రామాలను కవర్ చేస్తూ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంది. గ్రీన్ పీల్డ్ నేషనల్ హైవే రోడ్డు ప్రాజెక్టు కోసం స్థానిక రైతులు, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు కోరుతూ సమావేశం నిర్వహించారు. రఘునాథపాలెం మండల ఆఫీసు దగ్గర జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో సమావేశం జరిపారు. ఎటువంటి సమాచారం లేకుండా మీటింగ్ పెట్టడంతో సమావేశం ప్రారంభం నుంచే రైతులు, రైతు సంఘం నాయకులు స్థానిక ప్రజలు ఆందోళన నిర్వహించారు.
నగరాలకు దూరం ఉండాలి
ఇలాంటి హైవేలు నగరాలకు దూరంగా ఉండాలి కానీ.. ఈ హైవే మాత్రం ఖమ్మం నూతన కలెక్టరేట్ పక్క నుంచి వెళ్తుందని స్థానికులు అంటున్నారు. దీనివల్ల నగర ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడాతాయని వారు చెబుతున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించుకుంటూ భూమిని కోల్పోతున్న రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, ఇంగ్లీష్ పేపర్లకు యాడ్స్ ఇచ్చి, ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికారులపై రైతులు, స్థానికులు ఆగ్రహం
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్ లో ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. లాక్ డౌన్ టైం లో ఎలా సర్వే చేపట్టారని, తమకు కనీస సమాచారం లేకుండా ఢిల్లీకి రిపోర్టు ఎట్లా పంపారని నిలదీశారు. రైతుల పొట్ట కొట్టి హైవే నిర్మిస్తారా అని ప్రశ్నించారు.
రైతులకు సమాచారం అందించాం : అధికారులు
పర్యావరణానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరించామని, రైతులు చెప్పిన ప్రతి విషయాన్ని వీడియో తీశామని.. అన్నింటినీ పర్యావరణ శాఖకు అప్పగిస్తామన్నారు జిల్లా అడిషనల్ డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు.
ఎలాంటి స్పష్టత లేకుండా ముగిసిన మీటింగ్
ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు, స్థానిక ప్రజలకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే అధికారులు మీటింగ్ ముగించారని ప్రజలు చెబుతున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని వారు అంటున్నారు.