నర్సాపూర్,వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వల భూ సేకరణ ఆపాలంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నర్సాపూర్ జల హనుమాన్ దేవాలయం నుంచి హైదరాబాద్ ప్రజా భవన్ వరకు రైతుల పాదయాత్ర చేపట్టారు. నర్సాపూర్ మండలంలోని చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట, లింగాపూర్, శివ్వంపేట మండలం తిమ్మాపూర్, పిలుట్ల, గ్రామాల రైతులు పాదయాత్రగా బయలుదేరారు.
కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు తక్షణమే ఆపాలని రైతులు డిమాండ్ చేశారు. కాల్వల కోసం భూములు తీసుకోవడం వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసి భూములు కాపాడుకుంటామని రైతులు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్యాట మహేశ్ గౌడ్, నరసింహ రెడ్డి, కిష్టా గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీశైలం, బ్రాహ్మణపల్లి, రామకిషన్, కొండల్, కిషన్ నాయక్, గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.