ఫారెస్ట్ భూముల సర్వేను అడ్డుకున్న రైతులు

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ రేంజ్‌‌‌‌ పరిధిలోని అంకుసాపూర్‌‌‌‌ శివారులో ఉన్న అటవీ భూములను శనివారం సర్వే చేసేందుకు వెళ్లిన ఫారెస్ట్‌‌‌‌, రెవెన్యూ ఆఫీసర్లను స్థానిక రైతులు అడ్డుకున్నారు. కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌వో రమాదేవి, డిప్యూటీ రేంజ్‌‌‌‌ ఆఫీసర్లు రమాదేవి, బాబు పాటేకర్, మండల సర్వేయర్ శ్రీనివాస్‌‌‌‌ ఇతర సిబ్బంది జాయింట్‌‌‌‌ సర్వే చేసేందుకు భూముల వద్దకు చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆఫీసర్లను అడ్డుకున్నారు. తమ సాగు భూముల్లో కొలతలు వేసేందుకు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేను అడ్డుకోవడంతో ఆఫీసర్లు రైతుల వద్ద ఉన్న పట్టాదార్‌‌‌‌ పాస్‌‌‌‌ పుస్తకాలను చెక్‌‌‌‌ చేశారు. ఫారెస్ట్‌‌‌‌కు ఆనుకొని ఉన్న భూములకు పట్టాలు ఎలా వచ్చాయని ప్రశ్నించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కోవాలని చూస్తున్నారని, తమను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తర్వాత కొన్ని పేపర్స్‌‌‌‌పై సంతకాలు చేయాలని ఆఫీసర్లు కోరడంతో రైతులు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక ఆఫీసర్లు వెనుదిరిగారు.