చండ్రుగొండ, వెలుగు: చండ్రుగొండ మండలంలోని రావికంపాడు గ్రామ శివారులోని అటవీ భూముల్లో సోమవారం ఫారెస్ట్ ఆఫీసర్లు చేపట్టిన ట్రెంచ్ పనులను పోడుదారులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లకు పోడుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. పట్టాలున్న పోడు భూముల మధ్య నుంచి ట్రెంచ్ తీయవద్దని పోడుదారులు ఫారెస్ట్ ఆఫీసర్ల ను నిలువరించారు. పోడు పట్టాలున్న భూముల జోలికి వెళ్లడం లేదని పట్టాలు లేని అటవీ భూములకు రక్షణ గా ట్రెంచ్‌లు తీస్తున్నామని ఎఫ్డీఓ కోటేశ్వరావు, రేంజర్ ఎల్లయ్య పోడుదారులకు నచ్చజెప్పారు.
కొత్తగా పోడు భూముల్లో చెట్లు నరకడం, అడవులను ధ్వంసం చేస్తున్న క్రమంలో తమ హద్దుల్లో ట్రెంచ్ తీస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. ఎస్సై శివరామకృష్ణ సిబ్బంది తో ఘటనా ప్రదేశానికి వెళ్లి పోడుదారులతో మాట్లాడారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యతని, రాబోయే తరాల కోసం అడవులను రక్షించాలని వారిని కోరారు. కొత్తగూడెం, జూలూరుపాడు రేంజర్లు ప్రసాదరావు, శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.