చండూరు (మర్రిగూడ), వెలుగు : చర్లగూడ ప్రాజెక్టు పనులను చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, రాంరెడ్డి పల్లి గ్రామాల రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మర్రిగూడ మండలం శివన్నగూడలోని చర్లగూడ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ అభివృద్ధి కోసం తాము భూములు, ఇండ్లను కోల్పోయామని, పదేండ్లు కావస్తున్నా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేసేవరకు ప్రాజెక్టు పనులను జరగనివ్వమని భీష్మించి కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని బాధితులకు సర్దిచెప్పినా వినకపోవడంతో ఆర్డీవో ఫోన్లో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.