పెబ్బేరు, వెలుగు: పండ్ల తోట పాడవుతోందని తోట యజమాని జూరాల ఫీల్డ్ కెనాల్‌ను పూడ్చి వేయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని సుగూర్ గ్రామం పరిధిలోని రామేశ్వరాపూర్ శివారులో 12 ఏండ్లుగా జూరాల ఫీల్డ్ కెనాల్ ఉంది. గ్రామానికి చెందిన రైతు సయ్యద్ ఆరిఫుద్దీన్ అలియాస్ ముజాకర్ తాను కొత్తగా పెట్టిన పండ్ల తోట పాడవుతోందని ఇటీవల జూరాల ఫీల్డ్ కెనాల్‌ను పూడ్చి వేశాడు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. ఈ విషయాన్ని పీజేపీ డీఈ భావన దృష్టికి తీసుకెళ్లగా, ఎంక్వైరీ చేయాలని పెబ్బేరు ఏఈ మతీన్ ను ఆదేశించారు.
కాలువను పరిశీలించిన ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ కాలువ పూడ్చిన రైతుకు మద్దతు తెలిపారు. కాలువ పూడ్చిన రైతుతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి వెళ్లి పోయారని సూగూరు గ్రామ రైతులు చాకలి జయరాములు, మద్దిలేటి, ఎల్లయ్య, మన్నెమ్మ, బాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలంలో నుంచి పైప్ లైన్ వేసుకోవాలని, పండ్ల తోటలో మొక్కలు దెబ్బతింటే పరిహారం ఇస్తామని బాండ్ పేపర్ పై రాసిస్తేనే కాలువ తీసేందుకు ఒప్పుకుంటానని చెబుతున్నాడని వాపోయారు. పెబ్బేరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఎస్ఈ సత్యశీలారెడ్డిని ఫోన్లో వివరణ కోరగా, రైతులు రాత పూర్వకంగా కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటానని చెప్పారు.