భద్రాచలం, వెలుగు: తలాపునే గోదావరి, ఉపనదులు, వాగులు, వంకలు ఉన్నప్పటికీ జిల్లా రైతులకు యాసంగి సాగులో కష్టాలు తప్పడం లేదు. ఇరిగేషన్ లెక్కల్లో ఏళ్ల తరబడి యాసంగి ఆయకట్టు పెరగడం లేదు. కాగితాల్లో అంకెలకు, ఫీల్డ్ లెవల్లో సాగునీటికి పొంతనే కుదరడం లేదు. తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రైతులు పంటలను కాపాడుకునేందుకు బోర్లు,బావులపైనే ఆధారపడుతున్నారు. 2022–-23 సంవత్సరానికి యాసంగి సాగునీటి విడుదలకు సంబంధించిన స్టేట్‌లెవల్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. 12,351 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 3వ వారం నుంచి నీటిని ఆన్, ఆఫ్ పద్దతిలో విడుదల చేస్తారు. అయితే వాస్తవానికి అన్ని ఎకరాలకు నీరు రావడం లేదని రైతులు చెబుతున్నారు.
మూడు ప్రాజెక్టులున్నా..
జిల్లాలో తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. వానాకాలం పంటలకు తాలిపేరు నుంచి 24,700 ఎకరాలకు, కిన్నెరసాని నుంచి 10 వేలు, పెద్దవాగు నుంచి 2,360 ఎకరాలకు సాగునీరు ఇస్తుంటారు. కానీ యాసంగికి వచ్చే సరికి తాలిపేరు నుంచి 3 వేలు, కిన్నెరసాని నుంచి 9,051, పెద్దవాగు నుంచి 300 ఎకరాలకు మాత్రమే సాగునీటిని విడుదల చేస్తున్నారు. వానాకాలం పంటలకు 40,060 ఎకరాలకు, యాసంగి పంటలకు 12,351 ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారు. యాసంగి పంటల ప్రణాళిక 2,15,463 ఎకరాలు అయితే కేవలం 12,351 ఎకరాలకు మాత్రమే ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందుతోంది. మిగిలిన 2 లక్షల ఎకరాలు బోరు బావులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆయకట్టును పెంచడంలో ప్రభుత్వం, ఇరిగేషన్ ఆఫీసర్లు విఫలమవుతున్నారు.
తాలిపేరు కుడి కాల్వను మరిచిపోయిన్రు..
తాలిపేరు ప్రాజెక్టు మన్యంలో అతి పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కుడి కాల్వను ఇరిగేషన్ శాఖ మరిచి పోయింది. ఈ కాల్వ కింద 4 వేల ఎకరాలు సాగవుతోంది. కాల్వకు రిపేర్లు చేయకపోవడంతో యాసంగి, వానాకాలంలో గండ్లు పడి రైతులు పంటలను కాపాడుకోలేకపోతున్నారు. యా సంగిలో కేవలం 300 ఎకరాలకే సాగునీరు అం దుతోంది. ఈ ఏడాది కూడా ఇదే తంతు. జిల్లాలో ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో ఆయకట్టు పెరగడం లేదు. పాత లెక్కలు చెబుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. చెప్పే లెక్కలకు, ఇచ్చే నీటికి పొంతన ఉండటం లేదని రైతులు
వాపోతున్నారు.
సర్కారు నిర్లక్ష్యమే కారణం
ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు ఇబ్బందిగా మారుతోంది. జిల్లాలో నీటికి కొదవ లేకపోయినా సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. చెరువుల రిపేర్లు చేయడం లేదు. తాలిపేరు కుడి కాల్వను పట్టించుకోవట్లేదు. ఇరిగేషన్ ఆఫీసర్లు సరైన యాక్షన్ ప్లాన్ తయారు చేయకుండా సర్కారుకు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు.
మచ్చా వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
నీళ్లు ఇస్తున్నం
తాలిపేరు ప్రాజెక్టు కింద 3 వేల ఎకరాలకు తగ్గకుండా యాసంగి పంటలకు నీరు ఇస్తున్నాం. గతంలో 4వేల ఎకరాలకు పైగా ఇచ్చేవాళ్లం. కొంత తగ్గిన మాట వాస్తవమే. అయినా ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించి కాల్వల ద్వారా సాగు నీటిని అందిస్తున్నాం.
తిరుపతి, డీఈ, తాలిపేరు, చర్ల