- మా గ్రామాలకు ఎందుకు వస్తుండు..!
- బాల్క సుమన్‌కు నిరసనల సెగ
- అడ్డుకున్న కిష్టాపూర్, శివ్వారం గ్రామాల రైతులు
- గో బ్యాక్, బై బై బాల్క సుమన్ అంటూ నినాదాలు
జైపూర్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు నియోజకవర్గంలోని జైపూర్ మండలం కిష్టాపూర్, శివ్వారం గ్రామాల రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సుమన్ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నట్లు సమాచారం అందుకున్న ఆయా గ్రామాల రైతులు, ప్రజలు.. ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ గ్రామానికి బాల్క సుమన్ రావద్దని కిష్టాపూర్ రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపి.. గో బ్యాక్, బై బై బాల్క సుమన్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో పోలీసులు ఎంటరై రైతులు, ప్రజలను అడ్డుకొన్నారు. ఇక చేసేదేంలేక బాల్క సుమన్ గ్రామం లోపలికి వెళ్లకుండా మెయిన్ రోడ్డుపై తూతూ మంత్రంగా ప్రచారం నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా రైతులు లంబు సత్యనారాయణ రెడ్డి, మాయ శ్రీధర్ మాట్లాడుతూ.. నాలుగేండ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో గ్రామంలోని 400 ఎకరాల పంట పొలాలు నీట మునిగినా అక్కడి రైతుల బాధలు పట్టించుకోలేదని వాపోయారు. పంటలకు నష్ట పరిహారం చెల్లించలేని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇప్పుడు ఓట్ల కోసం మా ఊరికి ఎందుకు వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిష్టాపూర్ శివారులోని సర్వే నంబర్ 50లో ఏండ్ల తరబడి ఉన్న భూ సమస్యలను సుమన్‌కు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు.