- పట్టాలున్న భూమిలోసాగు చేస్తే.. ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నరు
- వివాదంపై ఎనిమిది నెలల కింద జాయింట్ కమిటీ
- ఇప్పటికీ కొనసాగుతున్న సమస్య
- పరిష్కరించాలని అధికారుల చుట్టు తిరుగుతున్న రైతులు
జగిత్యాల, వెలుగు: మల్లాపూర్ మండలంలో ఉన్న ఎస్సారెస్పీ నిర్వాసిత గ్రామాల కుస్తాపూర్, రత్నాపూర్ రైతులు తమ భూముల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో సాగు చేసిన భూములకు హద్దులు కేటాయించాలని ఏండ్ల నుంచీ అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు తమకు కేటాయించిన భూమిలోకి ఫారెస్ట్ అధికారులు ఇంకా రానివ్వడం లేదని అంటున్నారు. ఈ వివాదంపై ఎనిమిది నెలల క్రితం కలెక్టర్ అధ్వర్యంలో జాయింట్ కమిటీ వేసినా.. ఇప్పటికీ సమస్య తీరడం లేదు..
ఇదీ జరిగింది..
శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కుస్తాపూర్, రత్నాపూర్ రైతలకు మల్లాపూర్ శివారులోని 1040 సర్వే నంబర్లో భూములు కేటాయించారు. ఈ సర్వే నంబర్ లో 460.14 ఎకరాల భూమి ఉంది. ఇందులో 180 ఎకరాలు ఫారెస్ట్ భూమి కాగా 280.14 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. ఈ రెవెన్యూ భూమిలోని 94 ఎకరాలను 45 మంది రైతులకు కేటాయించారు. దానికి పట్టాలు కూడా అందించారు.
గతంలో ఈ భూమిలో రైతులు పంటసాగు చేసినట్ట చెప్తున్నారు. కానీ నీటి వసతి లేకపోవడంతో సాగు ఆపేశామని, పరిస్థితులు మెరుగుపడి, వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఏర్పడటంతో ఆరేండ్ల క్రితం సాగు చేయడానికి వెళ్లామన్నారు. కానీ ఆ భూమి ఫారెస్ట్ పరిధిలో ఉందని అధికారులు అడ్డుచెప్పారు. దీంతో రైతుల దగ్గర సర్కార్ అందించిన పాస్ బుక్, డీ-1 పట్టాలు ఉన్నా నిరుపయోగంగా మారాయి. ఆరేళ్లుగా పట్టాల ఆధారంగా భూములకు హద్దులు నిర్ణయించాలని ఆఫీసర్లను వేడుకున్న ఫలితం లేకుండా పోతుంది.
మూడు శాఖలతో కమిటీ ..
భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు హద్దులు ఏర్పాటు చేసేలా ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే, ల్యాండ్ రికార్డ్ డిపార్మెంట్ ఆఫీసర్ల తో కలెక్టర్ యాస్మిన్ బాషా 2023 జూలై 25న కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సర్వే ల్యాండ్ రికార్డ్ ఆసిస్టెంట్ డైరెక్టర్ ను మెంబర్లుగా నియమించారు. మూడు డిపార్మెంట్ లు కలిసి ఎంక్వేరీ చేసి 15 రోజుల్లో రిపోర్టు అందించాలని ఆదేశించారు. కమిటీ ఏర్పాటు చేసి 8 నెలలు గడిచినా హద్దులు ఏర్పాటు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read :అసెంబ్లీలో కొత్త వాయిస్.. జీరో అవర్లో సమస్యలు ప్రస్తావించిన ఫస్ట్ టైమ్ఎమ్మెల్యేలు
ఆరేళ్లుగా ఆఫీసుల చూట్టూ తిరుగుతున్నాం
సాగు నీరు కోసం భూములను ఇచ్చాం. పరిహారం కింద సాగు నీరు అందుబాటు లో లేని చోట భూములు ఇచ్చారు. ఇప్పటికే ఎంతో నష్టపోయాం. భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని ఆరేళ్లు గా ఆఫీసుల చూట్టూ తిరుగుతున్నాం. అధికారులు స్పందించాలి.
- సరికల మల్లయ్య, నిర్వాసిత రైతు
జాయింట్ సర్వే తో అలస్యం
సర్వే నెం 1040 లో జాయింట్ సర్వే తో ఆలస్యం జరుగుతోంది. ఆ ప్రాంతం లో చెట్లు ఎపుగా పెరడం తో చెట్లు తొలగించేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇది ఉన్నతాధికారుల పరిధిలోకి వస్తుంది.
- వీర్ సింగ్, మల్లాపూర్ తహసీల్దార్.