మార్కెట్లకు పోటెత్తిన వడ్లు..సూర్యాపేట జిల్లాలో కొనుగోళ్లు లేట్​

  •     వర్షభయంతో ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తున్న రైతులు 
  •     అన్​లోడింగ్​ ఆలస్యం వల్ల బారులు తీరుతున్న ట్రాక్టర్లు 

సూర్యాపేట, వెలుగు:  ఓవైపు సెంటర్లలో కొనుగోళ్లు లేట్​అవుతుండడం, మరోవైపు మార్కెట్​కు వరస సెలవులు, పైగా వర్షభయంతో సూర్యాపేట జిల్లా రైతులు ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లకు తరలిస్తున్నారు. శనివారం ఒక్కరోజే తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు 60వేల బస్తాలకు పైగా వడ్లు రాగా, సూర్యాపేట మార్కెట్ కు 30వేల బస్తాల వడ్లు వచ్చాయి. కాగా, వివిధ సమస్యల వల్ల అన్​లోడింగ్​ ఆలస్యం కావడంతో మార్కెట్ల బయట రోడ్లపై ట్రాక్టర్లు బారులు తీరాయి. 

కొనుగోళ్లలో జాప్యం వల్లే..

సూర్యాపేట జిల్లాలో సెంటర్లు ప్రారంభమై 13 రోజులు గడుస్తున్నా వడ్ల కొనుగోళ్లు స్పీడ్​ అందుకోలేదు. తేమ శాతం ఎక్కువ ఉందని,  పేర్లు రిజిస్టర్ కాలేదని.. ఇలా  వివిద కారణాలతో కేంద్రాల నిర్వాహకులు రైతులను తిప్పించుకుంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల 17శాతం కంటే ఎక్కువ మాయిశ్చర్​ వస్తుండడంతో వడ్లను కాంటా పెట్టడం లేదు.  ఈక్రమంలో శుక్ర, శనివారాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో రైతుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కొనుగోలు సెంటర్లలో ఉంటే తడిసి నష్టపోతామనే   వడ్లను మార్కెట్లకు తరలించారు. ప్రస్తుతం మార్కెట్లలో కుప్పలు పోసే జాగ కూడా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మద్దతు ఇవ్వకుంటే కఠిన చర్యలు : మందుల సామెల్, తుంగతుర్తి ఎమ్మెల్యే
 
 తిరుమలగిరి  మార్కెట్ లో ధాన్యం కొనుగోళ్లను  తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్   శనివారం పరిశీలించారు. రెండు రోజులు మార్కెట్ కు సెలవులు కావడంతో శనివారం 60 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కాంటా పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపారులు మద్దతు ధరకు వడ్లు కొనాలని, లేదంటే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.