వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు 

నల్గొండ అర్భన్ (కనగల్​), వెలుగు : నల్గొండ జిల్లా కనగల్ ​మండలంలోని ఎస్ లింగోటంలో ధాన్యం కొనాలని రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సాగర్​–హాలియా రహదారిపై ముళ్ల కంచెలు వేసి పురుగుల మందు డబ్బాలతో రాస్తారోకో చేశారు. దీంతో రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ నగేశ్​వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. జిల్లా అధికారులు వచ్చి ధాన్యం కొంటామని హామీ ఇచ్చేంతవరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే లేరన్నారు. 20 రోజులుగా ధాన్యం ఆరబెట్టి తేమశాతం వచ్చినా నిర్వాహకులు కాంటా వేయడం లేదన్నారు. వర్షాలు కురవడం, ధాన్యం తడవడం, మళ్లీ ఆరబెట్టడం ఇదే జరుగుతోందన్నారు. అడిషనల్​కలెక్టర్​భాస్కర్ రావు, తహసీల్దార్​ శ్రీనివాసరావు ఐకేపీ సెంటర్ వద్దకు చేరుకొని రైతులకు ఇబ్బంది కాకుండా రోజువారీగా లారీలు పంపిస్తామని చెప్పడంతో ఆందోళన నిర్వహించారు.