హైవేకు భూములియ్యం..ఎన్​హెచ్​ 63 భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు

హైవేకు భూములియ్యం..ఎన్​హెచ్​ 63 భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు
  • మూడుసార్లు అలైన్​మెంట్​ మార్చడంపై నిరసన 
  • జిల్లాలో 35 కిలోమీటర్లకు గాను 1,433 ఎకరాలు సర్వే 
  • గ్రామ సభలు పెట్టకుండానే నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆగ్రహం 
  • మార్కెట్​ రేటు రూ.30లక్షలు.. గవర్నమెంట్​ వ్యాల్యూ రూ.3లక్షలే 

మంచిర్యాల, వెలుగు: నేషనల్​ హైవే 63లో భాగంగా నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు ఫోర్​ లేన్​ హైవే నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు అలైన్​మెంట్​ మార్చి గోదావరి తీరం నుంచి సర్వే చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. 15 ఏండ్ల కిందట ఎల్లంపల్లి ప్రాజెక్టులో విలువైన సాగు భూములు కోల్పోయామని, ఇప్పుడు గ్రీన్​ హైవే పేరుతో ఉన్న భూములను గుంజుకోవద్దని వేడుకుంటున్నారు. 

మూడుసార్లు మారిన అలైన్​మెంట్​...  

ఎన్​హెచ్​ 63 అలైన్​మెంట్​ అనేక మలుపులు తిరుగుతోంది. జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం నుంచి ముల్కల్ల వరకు మొదట పొలాల మీదుగా గ్రీన్​ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం ఎన్​హెచ్​ఏఐ అధికారులు సర్వే చేశారు. విలువైన పంట పొలాలు రోడ్డు కింద పోతున్నాయని రైతులు ఆందోళన చేయడం, బడ్జెట్​ రీత్యా గ్రీన్​ఫీల్డ్​ హైవే వర్కవుట్​ కాకపోవడంతో విరమించుకున్నారు. రెండోసారి ప్రస్తుత హైవేనే ఫోర్ లేన్​గా విస్తరించడానికి ప్రపోజల్స్​ తయారు చేసి సర్వే చేపట్టారు. 

లక్సెట్టిపేట నుంచి ముల్కల్ల వరకు రోడ్డు పక్కనున్న బిల్డింగులు పోతున్నాయని ప్రజలు ఆందోళనకు దిగారు.  మళ్లీ ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి తాజాగా గోదావరి తీరం వెంబడి నిర్మించడానికి సర్వే చేశారు.  మరోవైపు ముల్కల్ల నుంచి కుర్మపల్లి వరకు ఫస్ట్  అలైన్​మెంట్​ మార్చి ప్రస్తుతం ప్రైవేట్ భూముల్లో సర్వే చేయడంతో ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  కొంతమంది బడా వ్యక్తుల భూములను కాపాడేందుకే అలైన్​మెంట్​ మార్చారని ఎన్​హెచ్ఏ​ఐ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. 

 35 కిలోమీటర్లు.. 1,433 ఎకరాలు..

ఎన్​హెచ్​ 63 నిజామాబాద్​ జిల్లా బోధన్​ నుంచి ఛత్తీస్​గఢ్‌​లోని జగదల్​పూర్​ వరకు వెళ్తుంది.  ట్రాఫిక్​ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్మూర్​ నుంచి మంచిర్యాల వరకు ఫోర్​లేన్ గా మార్చాలని సెంట్రల్​ గవర్నమెంట్​ నిర్ణయించింది. సుమారు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో 160 కిలోమీటర్ల పొడవున పొలాల మీదుగా గ్రీన్​ఫీల్డ్​ హైవే నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు ఎన్​హెచ్​ఏఐ అధికారులు 2018లో సర్వే చేసి అలైన్​మెంట్​ను రూపొందించారు.  

ఇటీవల జిల్లాలోని లక్సెట్టిపేట మండలం మోదెల నుంచి హాజీపూర్​ మండలం ముల్కల్ల వరకు ఫోర్​ లేన్​ నిర్మాణం కోసం ఎన్​హెచ్​ఏఐ అధికారులు మూడో అలైన్​మెంట్​ను రెడీ చేశారు. గోదావరి తీరం వెంట 35 కిలోమీటర్లు నిర్మించనున్న ఈ రోడ్డు కోసం జిల్లాలోని 17 రెవెన్యూ గ్రామాల్లో 1,433.75 8ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్​ జారీ చేశారు. 

 మార్కెట్​ రేటు రూ.30 లక్షలు... 

ఎన్​హెచ్​ 63 భూసేకరణ సర్వే చేసిన అధికారులు ప్రజాభిప్రాయం తీసుకోకుండానే నోటిఫికేషన్​ జారీ చేయడంపై బాధిత రైతులు భగ్గుమంటున్నారు.  గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద సాగు భూములను తీసుకున్నారని, ఇప్పుడు మిగిలిన కొద్దిపాటి భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మార్కెట్​ రేటు ఎకరానికి రూ.30 లక్షలు పలుకుతోంది. గవర్నమెంట్​ రేటు ఎకరానికి రూ.3లక్షల నుంచి రూ.3.50 లక్షలు మాత్రమే ఉంది. 

2013 భూసేకరణ చట్టం ప్రకారం మూడు రేట్లు నష్టపరిహారం అందజేసినా రైతులకు రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల మించి వచ్చే అవకాశం లేదు. తప్పనిసరిగా భూములు తీసుకోవాల్సి వస్తే భూమికి బదులు భూమి ఇవ్వాలంటున్నారు. లేదంటే మార్కెట్​ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు. గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, మార్కెట్​ వ్యాల్యూను రివైజ్​ చేయాలని కోరుతున్నారు.  

మూడున్నర ఎకరాలు పోతుంది..  

నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో 15 ఎకరాల భూమి పోయింది. ఇప్పుడు హైవేలో మూడున్నర ఎకరాలు పోతుంది. ఉన్న కాస్త భూమిని గుంజుకొని మట్టినే నమ్ముకున్న రైతులను రోడ్డుపాలు చేయొద్దు.
-  నాగిరెడ్డి గంగారెడ్డి, గుల్లకోట