- అలైన్మెంట్ మార్పులు, అరకొర పరిహారంపై రైతుల్లో వ్యతిరేకత
- ఏడు నియోజకవర్గాల్లో గెలుపోటములపై ఎఫెక్ట్
- అలైన్మెంట్మార్పిస్తామనిబీజేపీ హామీ
- తలపట్టుకుంటున్నఅధికార పార్టీ అభ్యర్థులు
యాదాద్రి, మెదక్, వెలుగు : హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల మీదుగా నిర్మించతలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు బీఆర్ఎస్ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పోయిస్తున్నది. ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నదే ఎన్నికల ముందు అధికార పార్టీకి మైనస్అవుతోంది. ఫస్ట్ ఫేజ్ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 20 మండలాలు,111 గ్రామాల మీదుగా ఈ ఆర్ఆర్ఆర్ వెళ్తోంది. కాగా, బీఆర్ఎస్లీడర్ల భూములు కాపాడేందుకు ఆఫీసర్లు అడ్డదిడ్డంగా అలైన్మెంట్లు మార్చడం, కోట్ల విలువజేసే భూములకు లక్షల్లో పరిహారం ఇచ్చేందుకు సర్కారు సిద్ధం కావడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
భువనగిరి జిల్లాలోనైతే రైతులు కేసులపాలయ్యారు. ఇలాంటి టైంలో ఎన్నికలు రావడం, ఓట్ల కోసం బీఆర్ఎస్అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు ట్రిపుల్ఆర్ఎఫెక్టెడ్గ్రామాలకు వెళ్తుండడంతో రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీనికితోడు ఇటీవల ట్రిపుల్ఆర్అలైన్మెంట్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. బీజేపీని గెలిపిస్తే అలైన్మెంట్మార్పిస్తామని యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన హామీ ఇవ్వడంతో ఏడు నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
13 వేల కోట్లు...338 కిలోమీటర్లు...
ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ బయట సుమారు రూ.13వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ మాల పరియోజన స్కీం’ కింద ట్రిపుల్ఆర్ నిర్మిస్తోంది. భూ సేకరణ విషయం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటున్నది. ప్రాథమిక అంచనా ప్రకారం 338 కిలోమీటర్ల పొడవుతో మొదట నాలుగు లేన్లుగా చేపట్టి, భవిష్యత్‌లో 6 నుంచి 8 లేన్లకు విస్తరించేలా ప్లాన్ చేశారు. ఉమ్మడి మెదక్‌లో105 కిలోమీటర్లు, యాదాద్రి జిల్లాలో 59.33 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో100 మీటర్ల వెడల్పుతో రోడ్డు, నాలుగు చోట్ల భారీ జంక్షన్లు నిర్మించాల్సి ఉండగా, దీని కోసం మూడు జిల్లాల పరిధిలోని సంగారెడ్డి, అందోల్, నర్సాపూర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో 3,429 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. యాదాద్రి జిల్లా ఆలేరు అసెంబ్లీ పరిధిలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో రైతులు 580 ఎకరాలు కోల్పోతున్నారు. భువనగిరి అసెంబ్లీ పరిధిలో నాలుగు మండలాలుండగా వలిగొండ, భువనగిరి మండలాల నుంచి దాదాపు వెయ్యి ఎకరాలు సేకరించనున్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలంలో రైతులు 300 ఎకరాలకు పైగా కోల్పోతున్నారు. మొత్తంగా యాదాద్రి జిల్లాలోనూ 1917 ఎకరాలను సేకరించనున్నారు.
రైతుల నుంచి వ్యతిరేకత
ట్రిపుల్ఆర్ కోసం భూ సేకరణను మొదటి నుంచి రైతులు వ్యతిరేకిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో రైతులు ఇప్పటికే మూడు సార్లు వివిధ ప్రాజెక్టుల కోసం తమ విలువైన భూములను కోల్పోయారు. మళ్లీ ట్రిపుల్ఆర్కోసం భూమి ఇవ్వాల్సి రావడం వారిని కలవరపెడుతోంది. అలాగే మొదట మార్కింగ్ఇచ్చిన ప్రకారం కాకుండా అధికార పార్టీ నాయకుల భూములు పోకుండా అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలోనూ వ్యతిరేకత తెలిపారు. అయినా రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోని ఆఫీసర్లు సర్వే నిర్వహించి, త్రీడీ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. యాదాద్రి జిల్లాకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ. 2 కోట్లకు పైగా పలుకుతుండగా ప్రభుత్వం తమ భూములు తీసుకుంటే మళ్లీ కొనుక్కొనే పరిస్థితి ఉండదని, అందుకని భూమికి భూమి ఇవ్వాలని కోరుతున్నారు.
బీఆర్ఎస్లోనూ డిమాండ్
బీజేపీ తరపున కేంద్రమంత్రి అనురాగ్ఠాకూర్ అలైన్మెంట్ మార్పుపై హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్లో కల వరం మొదలైంది. ఎన్నికల్లో అలైన్మెంట్ ప్రభావం కచ్చితంగా పడుతుందని, అదే జరిగితే పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. దీన్నుంచి బయటపడడానికి ట్రిపుల్ఆర్ అలైన్మెంట్మార్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పుపై ప్రభుత్వం నుంచి హామీ వస్తే తమకు కలిసి వస్తుందంటున్నారు.
అరెస్టులు..బేడీలతో ఇరకాటంలో బీఆర్ఎస్
ఈ ఏడాది మే 30న యాదాద్రి కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డిని ట్రిపుల్ ఆర్బాధితులు అడ్డుకున్నారు. దీంతో నలుగురు రైతులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపారు. బెయిల్‌కోసం రైతులు భువనగిరి కోర్టుకు వచ్చినప్పుడు వారి చేతులకు బేడీలు వేసి నడిపించారు. ఈ పరిణామాలు యాదాద్రి జిల్లాలోని బీఆర్ఎస్ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారాయి. అందరికంటే ఎక్కువగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ట్రిపుల్ఆర్'ట్రబుల్'గా మారింది.
ALSO READ : ఎన్నికల ప్రచారానికి బడా నేతలు .. హోరెత్తనున్న ప్రధాన పార్టీల ప్రచారాలు
ఎన్నికల ప్రచారం కోసం గత నెల 29న రాయగిరికి వెళ్లిన పైళ్ల కూతురు మన్వితను, నవంబర్2న ఎమ్మెల్యే మామ మోహన్‌రెడ్డిని బాధితులు అడ్డుకుని తిప్పి పంపారు. దీంతో ఎమ్మెల్యే పైళ్ల ట్రిపుల్ఆర్ ప్రభావం ఉన్న గ్రామాల వైపునకు వెళ్లడం లేదు. పైగా ట్రిపుల్ఆర్అలైన్మెంట్విషయంలో తనకు సంబంధం లేదని ఇటీవలే స్టేట్మెంట్కూడా ఇవ్వాల్సి వచ్చింది. శుక్రవారం భువనగిరికి వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ఠాకూర్అలైన్మెంట్మార్పు విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అలైన్మెంట్మార్పిస్తామని చెప్పడంతో ఆలేరు, భువనగిరి, మునుగోడు(చౌటుప్పల్) ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాయగిరి, బల్లంపల్లికి చెందిన బాధిత రైతులు అవుశెట్టి పాండు, మద్దూరి మాధవరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. ట్రిపుల్ఆర్వద్దు అన్న నినాదంతో ఆయన రైతులందరినీ కలుస్తుండంతో ఓట్లు కోల్పోతామేమో అన్న భయంలో ఉన్నారు.