- ఖమ్మం జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఒకరు
పెనుబల్లి, వెలుగు: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురు రైతులు శనివారం కరెంట్షాక్తో చనిపోయారు. ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బోగి శేషాద్రి (50) తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వరి వేశాడు. శనివారం పొలంలో మందు చల్లుతుండగా పొలానికి ఆనుకొని ఉన్న ఫెన్సింగ్ తీగలకు కరెంట్ సప్లై కావడంతో స్పాట్లోనే మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు , పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
కూసుమంచి మండలంలో..
కూసుమంచి, వెలుగు: జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో పిండిప్రోలు పంచాయతీ శివారు పాపాయిగూడెం గ్రామానికి చెందిన పిడియాల సీతారాములు(52) కరెంట్ షాక్తో చనిపోయాడు. తనకున్న ఎకరం భూమిలో కొంత వరి వేశాడు. పొద్దున పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటార్ ఆన్ చేసి ఇంటికి వచ్చాడు. తిరిగి 6 గంటల ప్రాంతంలో మళ్లీ పొలం వద్దకు వెళ్లాడు. మోటార్ ఆపే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్తో అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య అచ్చమ్మ, ఇద్దరు కొడుకులున్నారు.
రేగోడు మండలంలో..
రేగోడ్, వెలుగు: మెదక్ జిల్లా రేగోడు మండల పరిధిలోని ఆర్. ఇటిక్యాల గ్రామంలో కరెంట్ షాక్ తో రైతు ఇంటెన్క రాములు (40) మృతి చెందాడు. ఏ పంట వేసినా అడవి పందులతో ఇబ్బందులు పడ్తున్నామని, ఆర్థికంగాను నష్టపోతున్నామని తన పొలం చుట్టూ కరెంట్ కంచె ఏర్పాటు చేశారు.
శనివారం పొద్దున పెసర చేనులో కలుపు తీసేందుకు వెళ్లి కరెంట్ వేసిన సంగతి మర్చిపోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నారు.