సింగూరు పైనే  రైతుల ఆశలు..!

సింగూరు పైనే  రైతుల ఆశలు..!
  • సంగారెడ్డి జిల్లాలో 50 వేల ఎకరాల ఆయకట్టు
  • మెదక్ జిల్లా వనదుర్గ ప్రాజెక్ట్ కింద 21,625 ఎకరాల ఆయకట్టు
  • సాగుకు సన్నద్ధం అవుతున్న రైతులు, కొన్నిచోట్ల వరి నాట్లు 
  • సాగుకు నీరు విడుదల చేస్తారా ? లేదా? అని రైతుల్లో ఆందోళన

మెదక్, సంగారెడ్డి, వెలుగు: వానకాలం పంటల సాగుకు సంగారెడ్డి, మెదక్ జిల్లా రైతాంగం సింగూరు ప్రాజెక్టు మీదనే ఆశలు పెట్టుకుంది. రెండు జిల్లాల పరిధిలో దాదాపు 72 వేల ఎకరాలకు సింగూర్​నీరే ఆధారం. అయితే సింగూర్​ప్రాజెక్ట్​లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ లేకపోవడంతో ఈ సీజన్​లో పంటల సాగుకు నీటిని విడుదల చేస్తారా? లేదా అని సంగారెడ్డి, మెదక్​ జిల్లాల్లో వేలాది రైతులు సందేహిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటితో పాటు, అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పొలాలు సిద్ధం చేసుకుని వరి నాట్లు వేస్తున్న రైతులు సింగూరు ప్రాజెక్ట్​నుంచి నీరు విడుదల కాకుంటే తమ పరిస్థితి ఏంటని అయోమయానికి గురవుతున్నారు. సింగూర్​ నీటి విడుదల విషయంలో ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.     

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు వద్ద నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం13.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి జిల్లాలో కుడి, ఎడమ కాల్వల ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, కాల్వలకు అనుసంధానం చేసిన చెరువుల ద్వారా అదనంగా మరో 1‌0 వేల ఎకరాలకు నీరందుతుంది. ఇప్పటికే కాల్వల ద్వారా నీళ్లు విడుదల చేయాల్సి ఉండగా ప్రాజెక్టులో సాగుకు సరిపడా నీటి మట్టం లేకపోవడం వల్ల నీరు విడుదల చేయలేదు.

ప్రాజెక్టులో16 టీఎంసీల కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్నప్పుడు మాత్రమే నీటిని విడుదల చేస్తారు. ఇప్పుడు ఆ స్థాయిలో నీటి నిల్వ లేకపోవడంతో నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. తొలకరి జల్లులు పడగానే సింగూర్​ కాల్వల పరిధి ఆయకట్టులో దుక్కులు దున్నుకుని నారుమళ్లు పోసుకున్న రైతులు, కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే తీరా నాట్లు వేశాక ఇటు వర్షాలు పడక, అటు సింగూర్​ప్రాజెక్ట్​నుంచి నీరు విడుదల కాకపోతే పంటల పరిస్థితి ఏంటని రైతులు టెన్షన్​పడుతున్నారు.    

'ఘనపూర్​' రైతుల కలవరం

మెదక్  జిల్లాలోని ఏకైన మీడియం ఇరిగేషన్​ ప్రాజెక్ట్​ అయిన వనదుర్గా ప్రాజెక్ట్​ (ఘనపూర్​ఆనకట్ట) కింద కొల్చారం, మెదక్ టౌన్, మెదక్​రూరల్, పాపన్నపేట, హవేలి ఘనపూర్​మండలాల పరిధిలో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. సింగూర్​ ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేస్తేనే ఘనపూర్​ ఆనకట్ట ఆయకట్టు పొలాలు సాగవుతాయి. ఘనపూర్​ ఆనకట్టలో ఉన్న నీటిని మహబూబ్​నహర్, ఫతేనహర్​ కాల్వలకు విడుదల చేయడంతోపాటు, అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఆనకట్ట పరిధిలోని గ్రామాల రైతులు పంటల సాగు పనులు చేపట్టారు.

కొందరు రైతులు వరి నాట్లు కూడా వేశారు. మరికొందరు నాట్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఇబ్బంది లేకున్నా ఆనకట్టలో ఉన్న నీటి నిల్వ అయిపోతే పంటలకు నీటి తడులు అందించడానికి ఇబ్బందవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు పరిధిలోని రైతులు సింగూర్ ప్రాజెక్ట్​ నుంచి ఘనపూర్​ఆనకట్టకు నీటిని విడుదల చేయాలంటూ గత సోమవారం కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు.    

సాగుకు సరిపడ నీటి నిల్వ లేదు 

ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో కేవలం 13.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఫస్ట్ ప్రయారిటీగా తాగునీటి కోసం వినియోగించనున్న నేపథ్యంలో సాగు కోసం సరిపడ నీటి నిల్వ లేదు. ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటికి సరఫరా చేయడానికి మాత్రమే సరిపోతుంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగుకు నీరు అందిస్తే తాగునీటికి కటకట ఏర్పడుతుంది. ప్రాజెక్టు నిండుగా ఉంటే సాగునీటి సరఫరాకు ఉన్నతాధికారులు మొగ్గు చూపేవారు. కానీ ప్రస్తుత ప్రాజెక్టు నీటి నిల్వ పరిస్థితి అలా లేని కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు అందలేదు.

మహిపాల్ రెడ్డి, జేఈఈ, సింగూర్​ప్రాజెక్ట్​