- ఇక్కడ రూ.2,230.. అక్కడ రూ.3,300 నుంచి రూ.3,500
- వెలవెలబోతున్న కొనుగోలు సెంటర్లు
మహబూబ్‌నగర్, వెలుగు: పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో వడ్లకు మంచి రేటు రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు అక్కడే అమ్ముకుంటున్నారు. కొనుగోలు సెంటర్లు తెరిచి నెల కావస్తున్నా.. ఇప్పటి వరకు నాలుగో వంతు వడ్లను కూడా రైతుల నుంచి సేకరించ లేదు. అక్టోబరు, నవంబరు నెలల్లో ఆఫీసర్లు అసెంబ్లీ ఎన్నికల బిజీలో ఉండడంతో సెంటర్లపై పర్యవేక్షణ చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు, కర్నాటకలోని మార్కెట్లలో వడ్లను అమ్ముకున్నారు. కర్నాటక మార్కెట్లో ఎంఎస్పీ కన్నా ఎక్కువ రేటు రావడంతో అక్కడికే తరలిస్తున్నారు.
కర్నాటక మార్కెట్‌కు..
కర్నాటక సరిహద్దులో ఉన్న మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని కోయిల్‌కొండ, చిన్నచింతకుంట, దేవరకద్ర, మక్తల్, ఊట్కూరు, ధన్వాడ, నర్వ, మాగనూరు, కృష్ణ తదితర మండలాల్లో ఈ సీజన్లో రైతులు 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఆశించిన మేర దిగుబడులు వచ్చాయి. ఏటా ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు సెంటర్లలో రైతులు పంటను అమ్మేవారు. ఈ ఏడాది మాత్రం పెద్ద మొత్తంలో రైతులు వడ్లను కర్నాటక మార్కెట్లకు తరలించారు. కర్నాటకలో ఈ సీజన్లో వరి సాగు గణనీయంగా తగ్గిపోవడంతో, ఆ ప్రాంతంలో వడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇక్కడి రైతులు కర్నాటక మార్కెట్‌కు వడ్లను తరలించి అమ్ముకుంటున్నారు. ఇక్కడ సెంటర్లలో క్వింటాల్‌కు రూ.2,230 చెల్లిస్తుండగా, కర్నాటకలో రూ.3,300 నుంచి రూ.3,500 వరకు కొంటున్నారు. ఇక తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యాపారులు రూ.3,600 నుంచి రూ.3,700 వరకు కొనడం గమనార్హం.
కల్లంలోనే వడ్లు కొంటున్రు..
కర్నాటకకు సరిహద్దులో ఉన్న మండలాల్లో రైతులు రాయచూర్ మార్కెట్లకు వడ్లను తరలిస్తే.. జిల్లాల్లో ఉండే బియ్యం వ్యాపారులు మాత్రం నవాబ్‌పేట, బాలానగర్, మిడ్జిల్, జడ్చర్ల తదితర మండలాల్లో నేరుగా రైతుల కల్లాల వద్దకే వెళ్తున్నారు. అక్కడ పచ్చి వడ్లను కొంటున్నారు. క్వింటాల్‌కు రూ.3 వేల నుంచి రూ.3,100 వరకు చెల్లిస్తున్నారు. రైతులకు కూడా గిట్టుబాటు అవుతుండడంతో వారికే పంటను అమ్ముతున్నారు. ఏకంగా లారీలు తీసుకొచ్చి పెద్ద మొత్తంలో వడ్లను కొంటున్నారు. వడ్లు ఆరబెట్టడం, వడ్లను సంచుల్లోకి ఎత్తడం, నింపిన సంచులను ట్రాక్టర్లు, డీసీఎంలలో సెంటర్లకు తరలించడం వంటి ప్రయాస లేకపోవడం, ప్రభుత్వ సెంటర్లో అమ్మితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండడంతో ఎక్కువ మంది రైతులు వ్యాపారులకు పంటను అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాల్లో వడ్ల సెంటర్ల పరిస్థితి..
మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతుల నుంచి 2.60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు నవంబర్ ఒకటో తేదీ నుంచి సెంటర్లను ఓపెన్ చేయగా, అదే నెల రెండో వారం నాటికి సెంటర్లను మొత్తం తెరిచారు. సివిల్ సఫ్లయ్ ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం ఐకేపీ ద్వారా 94 సెంటర్లను ఓపెన్‌గా చేయగా, 55 చోట్ల మాత్రమే వడ్లు కొనుగోలు చేస్తున్నారు. పీఏసీఎస్ ద్వారా 87 సెంటర్లను ఓపెన్ చేయగా, 51 సెంటర్లలో వడ్లు కొంటున్నారు.
మెప్మా ద్వారా ఒక సెంటర్‌ను స్టార్ట్ చేయగా ఇంత వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. డీసీఎంఎస్ ద్వారా నాలుగు సెంటర్లను ఓపెన్ చేయగా, అన్ని సెంటర్లలో కొనుగోళ్లు స్టార్ట్ చేశారు. సెంటర్లను ప్రారంభించి 40 రోజులు కావస్తున్నా.. ఇంత వరకు టార్గెట్‌లో పావు వంతు కూడా వడ్లను కొనలేదు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్లంగా 32,259 మెట్రిక్ టన్నుల వడ్లను మాత్రమే సేకరించారు. నారాయణపేట జిల్లాలో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు చేయాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టుకున్నారు. వడ్ల సేకరణ కోసం 96 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 88 సెంటర్లను ప్రారంభించారు. మిగతా సెంటర్లు ప్రారంభించాల్సి ఉంది. అయితే, సెంటర్లు తెరిచినా ఆశించిన స్థాయిలో వడ్ల సేకరణ జరగడం లేదు.
డబ్బులు లేట్ చేస్తున్రని..
నిరుడు వానాకాలం సీజన్లో వడ్లను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో అమ్మిన. అప్పటి ప్రభుత్వం వడ్ల పైసలు నాలుగు నెలల తర్వాత అకౌంట్లో జమ చేసింది. చాలా ఇబ్బందులు పడ్డా. ఈసారి ప్రైవేట్ వ్యాపారులే మా కల్లాల వద్దకు వచ్చిన్రు. పచ్చి వడ్లు ఉన్నా కొంటామని చెప్పారు. దీంతో వడ్లను మొత్తం వారికే అమ్మిన.
మామిళ్ల శ్రీశైలం, అమ్మపల్లి, బాలానగర్ మండలం
హమాలీ, ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా ఇస్తున్రు..
కర్నాటకలోని రాయచూర్ మార్కెట్లో వడ్లకు డిమాండ్ బాగా ఉంది. నేను కూడా అక్కడికే పంటను తీసుకుపోయిన. క్వింటాల్‌కు రూ.2,500 చెల్లించారు. పైగా హమాలీ, వడ్లను ట్రాక్టర్లో తీసుకుపోయినందుకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా ఇచ్చిన్రు. మంచి లాభం వచ్చింది.
భీమేశ్, అచ్చంపేట, మాగనూరు మండలం
లాభం వచ్చిందని అమ్మిన..
నాకున్న రెండు ఎకరాల్లో వరి వేసిన. 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట కోయగానే ప్రైవేట్ వ్యాపారులు వచ్చారు. క్వింటాల్‌కు రూ.2,400 ఇస్తామన్నారు. పచ్చి వడ్లు అంత రేటు రావడం మాకు లాభం అవుతుంది. అందుకే వారికి సగం పంట అమ్మిన. మిగతా వడ్లను బియ్యం కోసమని అమ్మలేదు.
బంగారు, బోయిన్పల్లి, మిడ్జిల్ మండలం