నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం అకాల వర్షాలతో వడగండ్లు పడ్డాయి. దీంతో వరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మరో రెండు వారాల్లో కోతలు షురూ కానుండగా అకాల వర్షాలు వరిపంటను దెబ్బతీశాయి. నిజామాబాద్జిల్లాలోని సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో సుమారు 40 నిమిషాల పాటు వర్షం కురిసింది. ఆర్మూర్, మోపాల్ మండలాల్లో చినుకులు పడ్డాయి. నిజామాబాద్లో సుమారు గంటపాటు కరెంట్సరఫరా నిలిచిపోయింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ఈదురు గాలులకు చిన్నచిన్న చెట్లు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు ఏరియాల్లో కరెంట్సప్లయ్ నిలిచిపోయింది. వడగళ్లతో పంట నష్టం జరిగినట్లు రైతుల నుంచి సమాచారం అందుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడారు
ఆదివారం క్షేత్రస్థాయిలో విజిట్చేసి నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. తాను కూడా వడగండ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తానన్నారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.