లారీల కోసం రైతుల తిప్పలు

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఉంది రాష్ట్రంలోని రైతుల పరిస్థితి.  ఓవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతినగా..పంటను అమ్ముకున్నాక కూడా రైతులకు అవస్థలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని వానల నుంచి కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. చివరకు పంటను అమ్మిన తర్వాత కూడా రైతులు తిప్పలు పడుతున్నారు. 


సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు సెంటర్లలో  వడ్లను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు.. ఆ తర్వాత వాటిని మిల్లులకు తీసుకెళ్లడం లేదు. కారణం లారీల కొరత. ఈ ఆలస్యం కారణంగా రైతులు తమ పంటను అమ్ముకున్నా..కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో  వానలు పడితే అమ్ముకున్న పంటంతా తడిసిపోతుంది. దీన్ని కారణంగా చూపి మిల్లర్లు తరుగు పేరుతో రైతులను మరింత దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులే  స్వయంగా లారీలను వెతుక్కునే పనిలో పడ్డారు. మిల్లర్లు  పంపే లారీ కోసం పడిగాపులు పడలేక.. రైతులు రహదారిపై ఉన్న లారీ యజమానులను, డ్రైవర్లను వేడుకుంటున్నారు.

లారీల కొరతపై సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అకాల వర్షంతో సగానికి సగం పంట నష్టపోయామంటున్నారు. దీనికి తోడు పంటను అమ్ముకున్న తర్వాత కూడా తమకు కష్టాలు తప్పడం లేదంటున్నారు. అరుగాలం కష్టపడి, వేలు ఖర్చుపెట్టినా.. చివరకు పెట్టుబడైనా వస్తుందో లేదోనని అన్నదాతలు దిగులు చెందుతున్నారు.