శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల అరిగోస!

  •     కాంటా పెట్టడంలో  రోజుల తరబడి డిలే ..
  •     కాంటా అయినంక నాణ్యత లేదంటూ తిరస్కరణ 
  •      దిక్కు లేక  దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు

 కామారెడ్డి , వెలుగు:  జిల్లాలో ఆరుగాలం కష్టపడి పండించిన శనగలు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ  నిర్వాహకులు సకాలంలో కాంటాలు పెట్టక రోజుల తరబడి డిలే చేయడం, కాంటా అయిన తర్వాత కూడా శనగల్లో నాణ్యత లేదని తిరస్కరిస్తుండడంతో  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు.  

 జిల్లాలో పరిస్థితి..

 జిల్లాలో యాసంగి సీజన్​లో రైతులు  87,180 ఎకరాల్లో  శనగ పంటను సాగు చేశారు.  37 వేల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని,  ఇందులో 22 వేల మెట్రిక్​ టన్నుల  శనగలు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని  అధికారులు అంచనా వేశారు. రైతుల  నుంచి నేరుగా శనగలు కొనుగోలు చేసేందుకు  మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో సొసైటీల్లో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శనగ పంట ఎక్కువగా సాగు చేసిన   జుక్కల్​, మద్నూర్​, బిచ్కుంద, పిట్లం,  పెద్దకొడప్​గల్​, రాజంపేట , గాంధారి మండలాల్లో   కొనుగోలు  కేంద్రాలు ప్రారంభించారు.  

 అడుగడుగునా నిర్లక్ష్యమే..

 కొనుగోలు కేంద్రాల్లో  కాంటాలు పెట్టడంలో  మొదటి నుంచీ డిలే అవుతోంది.  శనగలు తీసుకొచ్చిన వారం, పది రోజుల వరకు కూడా నిర్వాహకులు కాంటా పెట్టడం లేదు.  ఒక వేళ కొన్న శనగలను కూడా  కేంద్రం నుంచి   గోడౌన్​కు  పంపడంలోనూ ఆఫీసర్లు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకు జిల్లాల్లో  11వేల మెట్రిక్​ టన్నుల శనగలు కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.  జుక్కల్​, మద్నూర్​,పెద్ద కొడప్​గల్​ ఏరియాల్లో  కొనుగోలులో ఆలస్యమవుతుండడంతో  రైతులు ఆందోళనలకు దిగుతున్నారు.  రాజంపేట మండలం ఆర్గొండలో  కాంటా పెట్టి శనగలను గోడౌన్ కు తరలించిన తర్వాత నాలుగైదు రోజులకు  నాణ్యతగా లేవంటూ  తిరస్కరించి కొనుగోలు కేంద్రానికి పంపారు.  విషయం తెలిసిన  రైతులు ఆందోళన చేపట్టి సొసైటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నాణ్యత చూసిన తర్వాతనే కొనుగోలు చేసి తీరా గోడౌన్​కు తీసుకెళ్లినంక నాణ్యత లేవనడం ఏమిటని రైతులు నిలదీశారు.  గోడౌన్​లో క్వాలిటీ చెక్​చేసే ఆఫీసర్లు  తిరస్కరించారని సిబ్బంది తెలిపారు. 

దళారులకు తక్కువ రేట్​కు..

 కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండడం,    నిర్వాహకులు శనగలు నాణ్యత లోపించిందని   తిరస్కరిస్తుండడంతో దళారులు ఇదే అదునుగా  భావిస్తున్నారు. మద్దతు ధర కంటే  తక్కువ రేట్​కు రైతుల నుంచి  కొనుగోలు చేస్తున్నారు.  కొనుగోలు కేంద్రంలో క్వింటాల్​కు రూ.  5,335 రేట్​ఉంది.   దళారులు క్వింటాల్​కు రూ.4,200 నుంచి రూ.4,700 వరకు కొంటున్నారు. గత్యంతరం లేని  పరిస్థితుల్లో రైతులు తక్కువ రేట్ అయినా సరే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.  క్వింటాల్​కు రూ. 1100  వరకు నష్టపోతున్నామని వాపోతున్నారు.  కొన్ని  ప్రాంతాల్లో  రైతుల నుంచి తక్కువ రేట్​కు కొనుగోలు చేసి వాటినే  దళారులు  కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

నాణ్యత లేవని రిటర్న్​ పంపిన్రు.. 

శనగలు కాంటా పెట్టిన తర్వాత నాణ్యత లేవని రిటర్న్​ పంపిన్రు.  కాంటా పెట్టేటప్పుడు అన్ని రకాలుగా పరిశీలించే కొన్నరు.  గోడౌన్​కు తరలించిన తర్వాత నాణ్యత లేవని చెప్పి పంపిస్తే మేం ఎక్కడ అమ్ముకోవాలి. మళ్లీ బయటకు తీసుకుపోతే దళారులు అడ్డికి పావశేరు లెక్కన అడుగుతున్నారు.  ఎంత తక్కువ ఉన్నా అమ్ముకోవాల్సి వస్తోంది. 
–‌‌‌‌‌‌ సిద్ధి రాములు, ఆర్గొండ

 రైతులకు ఇబ్బందులులేకుండా చూస్తున్నాం

శనగలు రూల్స్​ ప్రకారం  కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా  రైతులకు ఇబ్బంది లేదు.  అగ్రికల్చర్​ఆఫీసర్​సర్టిఫికేట్​ఇచ్చిన  ప్రకారం రైతుల నుంచే కొంటున్నాం.  కాంటా పెట్టిన తర్వాత గోడౌన్​ను తరలించాక  అక్కడ క్వాలిటీ పరిశీలించి  తిరస్కరిస్తున్నారు. దీని విషయంలో  మేం ఏం చేయలేం. 
– రంజిత్​రెడ్డి, మార్క్​ఫెడ్​జిల్లా ఇన్​చార్జి