వడ్లమ్మినా పైసలు వస్తలే...డబ్బుల కోసం రోజుల తరబడి రైతుల ఎదురుచూపులు

నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్​లో గవర్నమెంట్​కు వడ్లమ్మిన రైతులు పైసల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 2 నెలల నుంచి పేమెంట్లు  జరగడం లేదు. దళారులను నమ్మి మోసపోవద్దని, సర్కారు కాంటాలకు తూకం వేసిన వారంలోనే డబ్బులు అకౌంట్​లో వేస్తామన్న గవర్నమెంట్​ఇచ్చిన హామీ నెరవేరడం లేదు. దీంతో వానాకాలం పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

6.31 లక్షల మెట్రిక్​టన్నుల కొనుగోళ్లు..

జిల్లాలో వడ్ల కొనుగోళ్ల కోసం 467 సెంటర్లు​ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. అనంతరం 406 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ల ద్వారా 6.31 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సరిగ్గా పంట కోతలు ముగిశాక అకాల వర్షాలు, వరదలు రైతులను ఆగం చేశాయి. క్వింటాకు 6 నుంచి 8 కిలోలు  తరుగు తీసినా, రాజీపడి కాంటాలు ముగించారు. మొత్తం కొనుగోలు చేసిన వడ్లకు రూ.1,301 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.773 కోట్లు ఇచ్చారు. మిగతా రూ.528 కోట్లు ఇంకా పెండింగ్​లో ఉన్నాయి. తమకు రావాల్సిన డబ్బులు ఏవని రైతులు అడిగితే, గవర్నమెంట్​నుంచి ఎప్పుడొస్తే అప్పుడు ఇస్తామని అధికారులు ఆన్సర్​ ఇస్తున్నారు.

సీజన్​ ముందుకు జరపాలని మీటింగ్​లు

మొన్నటి అకాల వర్షాలు, వరదలు చేసిన నష్టాల అనుభవంతో పంట సీజన్​త్వరగా ముగించేలా రైతులను సిద్ధం చేయాలని అగ్రికల్చర్​ఆఫీసర్లకు సర్కారు పెద్దలు ఆర్డర్స్​ఇచ్చారు. ఇందుకు సంబంధించి మీటింగ్​లు జరిగాయి. జిల్లాలోని బోధన్ ​ప్రాంతంలో తొలకరికి వరినాట్లు పూర్తిచేసే సంప్రదాయం ఉంది. మరో వారంలో అక్కడ నారుమడి సిద్ధమవనుంది. ఇతర ప్రాంతాల్లో దుక్కులు దున్ని, విత్తనాలు, యూరియా సమకూర్చుకునే పనుల్లో రైతులు ఉన్నారు. వీటన్నింటికి డబ్బులు కావాలని, వడ్లమ్మిన పైసలు రాక.. చేతిలో పైసలు లేక పంట పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని రైతులు ఆవేదన 
వ్యక్తం చేస్తున్నారు.

డబ్బు రాగానే పేమెంట్లు

ఇంకా రూ.528 కోట్ల వడ్ల బిల్లులు చెల్లించాల్సిన మాట నిజమే. మా చేతిలో ఏంలేదు. గవర్నమెంట్​నుంచి ఎప్పుడొస్తే అప్పుడే చెల్లిస్తం.

- జగదీశ్​కుమార్, సివిల్​సప్లయ్​ఆఫీసర్​

వడ్లు జోకి రెండు నెలలయింది

సొసైటీ వాళ్లు వడ్లు జోక్కొని 2 నెలలైంది. ఇప్పటిదాకా నయా పైసా రాలే. దళారులకు అమ్మినా వారంలో డబ్బులు చేతికాందేవి. మద్దతు ధర వస్తుందని ఆశపడితే పరేషాన్​ అవుతోంది. దుక్కులకు ట్రాక్టర్ ఓనర్లు మొదాలే పైసలు అడుగుతుండ్రు. విత్తనాలు, మందులకు చేతిలో చిల్లి గవ్వ లేదు. వానాకాలం ఖర్చు మొత్తం వడ్ల పైసలమీదే ఆధారపడి ఉంది.  

- రాజారెడ్డి, తొర్తి, మోర్తాడ్​

నెలసంది చూస్తున్నా..

సొసైటీకి నెల కింట వడ్లమ్మిన. సొంత భూమి రెండెకరాలకు తోడు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట పండించిన. రూ.2 లక్షల బిల్లు రావాలె. ప్రతిరోజూ అడుగుతున్నా. వచ్చే పైసల్లో కొన్ని బాకీ గట్టి, మిగతా డబ్బు వానాకాలం ​పంటకు ఖర్చు చేయాల్సిఉంది. గింతగానం లేట్​చేస్తే మా చిన్న ప్రాణాల సంగతి ఎట్ల

- దార్శి భూమయ్య, సాలూరా, బోధన్​