మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్పుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఆర్ఆర్ఆర్ఫస్ట్ ఫేజ్మెదక్జిల్లాలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్ మండలాల మీదుగా వెళ్లనుంది. ఇందుకు సంబంధించి దాదాపు ఏడాది కిందటే ఫీల్డ్ లెవెల్సర్వే జరగ్గా, కన్సల్టెన్సీ సంస్థ ఆరు నెలల క్రితమే రింగ్‌రోడ్డు వెళ్లే రూట్లో మార్కింగ్ఇవ్వడంతోపాటు, హద్దురాళ్లు పాతింది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్నోటిఫికేషన్జారీ చేయగా, కొద్ది రోజులుగా అలైన్మెంట్సర్వే జరుగుతోంది. కాగా, పలు చోట్ల ఏడాది కిందట సర్వే నిర్వహించి మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సర్వే చేస్తున్నారు. అధికార పార్టీ లీడర్ల భూములు కోల్పోకుండా ఉండేందుకే రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
పేద రైతులకు నష్టం
అలైన్మెంట్ మార్చడం వల్ల పేద రైతులు ఎక్కువగా నష్టపోనున్నారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిగేట్దగ్గర ఇంటర్చేంజ్జంక్షన్ నిర్మించనున్నారు. దీని కోసం ఇక్కడ 60 నుంచి 80 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇదివరకు సర్వే చేసినపుడు రెడ్డిపల్లి చౌరస్తా దగ్గర నుంచి పెద్దచింతకుంట మధ్య నుంచి రింగ్‌రోడ్డు వెళ్తుందని చెప్పారు. ఆ ప్రాంతంలో హద్దులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాత్రం రెడ్డిపల్లి చౌరస్తా నుంచి మెదక్ రూట్లో రింగ్ రోడ్డు నిర్మించేలా భూసేకరణకు చేపట్టారు. పెద్దచింతకుంట వైపు ఓ కేబినెట్‌మంత్రి బంధువుల భూములున్నాయని, అందువల్ల వారికి నష్టం కలుగకుండా ఉండేందుకే పరపతి ఉపయోగించి అలైన్మెంట్మార్పించారని రెడ్డిపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. పాత సర్వే ప్రకారం 30 మంది రైతుల భూములు మాత్రమే పోయేవని, అలైన్మెంట్మార్చడం వల్ల దాదాపు 100 మంది చిన్న, సన్నకారు రైతుల భూములు పోతున్నాయని తెలిపారు. అలాగే శివ్వంపేట మండలంలో కూడా అలైన్మెంట్మార్చడంపై నిరసన వ్యక్తమవుతోంది. పాత సర్వే ప్రకారం అల్లీపూర్ నుంచి రింగ్ రోడ్డు వెళ్లాల్సి ఉండగా, ఆ ప్రాంతంలోని అధికార పార్టీ లీడర్ల భూములకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు లింగోజిగుడ మీదుగా వెళ్లేలా అలైన్మెంట్మార్చారంటున్నారు.
ఎమ్మెల్యేకు మొర
ఇటీవల నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రెడ్డిపల్లికి రాగా స్థానిక రైతులు ఆయనను కలిసి రింగ్‌రోడ్డు అలైన్మెంట్మార్పు వల్ల కలిగే నష్టం గురించి వివరించారు. గతంలో ఓ వైపు నుంచి రోడ్డునిర్మించేలా సర్వే చేసి హద్దులు పెట్టి, ఇపుడు అలైన్మెంట్మార్చడం వల్ల వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేగాక చెరువుకు కూడా నష్టం కలుగుతుందన్నారు. పాత సర్వే ప్రకారమే రింగ్‌రోడ్డు నిర్మించేలా చూడాలని కోరారు.
సర్వేను అడ్డుకున్న రైతులు
భూసేకరణ ప్రక్రియలో భాగంగా అలైన్మెంట్ సర్వే కోసం గత శుక్రవారం నర్సాపూర్ఇన్చార్జి తహసీల్దార్ మూర్తి, ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్శేఖర్ వర్మ, సర్వేయర్ లాల్య రెడ్డిపల్లికి రాగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వీరికి మద్దతు పలికారు. అలైన్మెంట్ఎందుకు మార్చారని అధికారులను నిలదీశారు. కొంత మంది పెద్ద రైతుల కోసం ఎంతో మంది పేద రైతులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. రైతుల అభ్యంతరాలతో ఆఫీసర్లు సర్వే చేయకుండానే వెనుదిరిగారు.
నాలుగెకరాలు పోతోంది
మార్చిన అలైన్ మెంట్ప్రకారం రింగ్ రోడ్డు నిర్మాణంలో మాది నాలుగు ఎకరాలు పోతోంది. ఇది ఎంతో విలువైన భూమి. మా కుటుంబానికి ఇదే ఆధారం. ఈ భూమి పోతే మా పరిస్థితి ఏమి కావాలి. ప్రభుత్వం మాకు మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం ఇస్తుందా ?
– ప్యాట మహేశ్‌గౌడ్ , రైతు, రెడ్డిపల్లి
బడా రైతుల కోసం అలైన్మెంట్ మార్పు
రెడ్డిపల్లి రైతులు ఇదివరకే కాళేశ్వరం కాల్వలు, సొరంగం నిర్మాణం, హైటెన్షన్‌లైన్ కోసం భూములిచ్చారు. ఇప్పుడు మళ్లీ రింగ్‌రోడ్డుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. అంతేగాక అధికార పార్టీ నాయకుల భూములకు నష్టం కలుగకుండా చూసేందుకే నర్సాపూర్మండలం పెద్దచింతకుంట నుంచి వెళ్లాల్సిన రింగ్‌రోడ్డును రెడ్డిపల్లి వైపు మార్చారు. దీనివల్ల రెడ్డిపల్లికి చెందిన అనేక మంది పేద రైతులు ఉన్నకొద్దిపాటి భూమి కోల్పోయి రోడ్డున పడతారు.
– ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి
ఎమ్మెల్యే అనుచరుల బెనిఫిట్ కోసం
నర్సాపూర్ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఇద్దరు, ముగ్గురి కోసం అధికారుల మీద ఒత్తిడి చేసి రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చారు. వారికి లాభం చేకూర్చేందుకు 10, 20, 30 గుంటల భూమి ఉన్న రైతుల పొలాల మీదుగా రింగ్‌రోడ్డు నిర్మించేలా చూస్తున్నారు. ఇది చాలా అన్యాయం. దీన్ని మేం చూస్తూ ఊరుకోం. అవసరమైతే కోర్టుకు వెళ్తాం.
– సింగాయిపల్లి గోపి, బీజేపీ నర్సాపూర్ సెగ్మెంట్ ఇన్చార్జి