వడ్ల తరలింపులో నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన రైతులు

  • ఎగ్లాస్‌పూర్‌‌లో ఎంపీపీని అడ్డుకొని నిరసన 

కోనరావుపేట, వెలుగు: వడ్ల తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రైతులు  రోడ్డెక్కారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్ ​రైతులు కోనుగోలు కేంద్రాల్లోని వడ్లను మిల్లులకు తరలించడంలేదని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మండలా ఫీసులో దశాబ్ది ఉత్సవాలకు వెళ్తున్న ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ను అడ్డుకొని నిరసన తెలిపారు.

 రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం నుంచి 4 లారీల్లో వడ్లు తరలించి వారమైనా మిల్లర్లు దించుకోవడం లేదన్నారు. వడ్లు రంగు మారాయంటూ బస్తాకు 4కేజీలు కటింగ్‌కు ఒప్పుకుంటేనే దించుకుంటామని కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు. సుమారు గంటన్నర పాటు ధర్నా చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ రవికాంత్ అక్కడికి చేరుకొని లారీలు పంపి కొనుగోలు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.