లక్సెట్టిపేట, వెలుగు: నేషనల్ హైవే విస్తరణ కోసం సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను శుక్రవారం ఇటిక్యాల దగ్గర రైతులు అడ్డుకున్నారు. హైవే మూడో అలైన్మెంట్ వల్ల పలు గ్రామాల్లో సాగుభూములు కోల్పోవాల్సివస్తోందని ఇటీవల లక్సెట్టిపేట , జీపూర్ మండలాల రైతులు లక్ష్మీపూర్ దగ్గర హైవే మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు శుక్రవారం సర్వేకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలాలు పొట్ట దశకు చేరుకున్నాయని, పంట చేతికి వచ్చేవరకు సర్వే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
కొంతమంది మహిళలు కూడా అక్కడకు చేరుకుని ఆందోళన చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన చేస్తున్న కొంతమంది రైతులను అరెస్టు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అధికారులు పోతపల్లి వరకు సర్వే చేశారు. గతంలో ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చామని, మళ్లీ భూములు కోల్పోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.