మా భూములు తీసుకుంటే మేమెట్లా బతకాలె సారూ.. ?

మా భూములు తీసుకుంటే మేమెట్లా బతకాలె సారూ.. ?
  • ఆఫీసర్ల కాళ్లపై పడి కంటతడి పెట్టిన ట్రిపుల్‌‌ ఆర్‌‌ బాధిత రైతులు
  • సర్వేను అడ్డుకొని నిరసన

శివ్వంపేట/నర్సాపూర్‌‌, వెలుగు : మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్‌‌ గ్రామంలో ట్రిపుల్‌‌ ఆర్‌‌ రోడ్డు సర్వేకు శనివారం వచ్చిన ఆఫీసర్లను రైతులు అడ్డుకున్నారు. ఆర్‌‌ఐలు కిషన్, సునీల్‌‌, సర్వేయర్లు సతీశ్‌‌, అనురాధ, ఎస్సై మహిపాల్‌‌రెడ్డి పోలీస్‌‌ బందోబస్తుతో వచ్చి సర్వే చేసేందుకు ప్రయత్నాలు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్‌‌ ఆర్డీవో జగదీశ్వర్‌‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

మల్లమ్మ అనే మహిళా రైతు ‘నాకు భూమే ఆధారం, అది పోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ ఆర్డీవో కాళ్లపై పడింది. మరో రైతు శంకర్‌‌ మాట్లాడుతూ ‘నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఉన్న 1.20 గుంటల భూమి రోడ్డులో పోతోంది. ఇప్పుడు మేమే ఎట్లా బతకాలె, పిల్లల పెండ్లి ఎలా చేయాలె, అందరం కలిసి పురుగుల మందు తాగి చస్తాం’ అంటూ ఆర్డీవో కాళ్లపై పడి కంటతడి పెట్టాడు. ప్రాణాలు పోయినా సరే భూమి మాత్రం ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు.

కొందరు పెద్దల భూములు పోతున్నాయంటూ అలైన్‌‌మెంట్‌‌ మర్చారని, గతంలో చేసిన సర్వే ప్రకారమే రోడ్డు వేయాలని డిమాండ్‌‌ చేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను పట్టా చేసి ఇస్తేనే తమ భూములు ఇస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తానని ఆర్డీవో చెప్పారు.

అలాగే మెదక్‌‌ – హైదరాబాద్‌‌ నేషనల్‌‌ హైవే రెడ్డిపల్లి గేటు వద్ద ట్రిపుల్‌‌ ఆర్‌‌ బాధితులు శనివారం సర్వేకు వచ్చిన ఆఫీసర్లను అడ్డుకొని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చత్తీస్‌‌గఢ్‌‌ కరెంట్‌‌లైన్‌‌, కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్‌‌ వంటి వాటికి ఇప్పటికే విలువైన భూములు ఇచ్చామని, ఇప్పుడు ట్రిపుల్‌‌ ఆర్‌‌ కోసం భూములు తీసుకోవడంతో తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.